
చార్లీ హత్యపై కామెడీ.. టెక్సాస్ విద్యార్థి బహిష్కరణ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాద కార్యకర్త చార్లీ కిర్క్ హత్య అగ్రదేశంలో తీవ్ర దుమారం రేపింది. ట్రంప్ సహా అమెరికాలోని పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ హత్యపై వ్యంగ్యంగా స్పందించిన విద్యార్థిని టెక్సాస్ వర్సిటీ బహిష్కరించింది. సదరు విద్యార్థి చార్లీ హత్యను అపహాస్యం చేస్తూ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్పందించిన వర్సిటీ యాజమాన్యం వెంటనే విద్యార్థిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వీడియోను విద్యార్థి స్కూల్ ప్రాంగణంలోనే, ఇతర విద్యార్థుల ముందే చిత్రీకరించడం విశేషం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో అతను చార్లీ కిర్క్ను బుల్లెట్ తగిలినట్లు నటిస్తూ, గొంతు మీద కొట్టుకొని కింద పడిపోయాడు. చివరికి జాతి విద్వేషాలను రెచ్చగొట్టే పదాలు కూడా ఉపయోగించాడు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని, విద్యార్థిని వెంటనే కాలేజీ నుంచి తొలగించాలని తన సోషల్ మీడియా వేదికగా కోరారు.
టెక్సాస్ యూనివర్సిటీ అధ్యక్షుడు కెల్లి డాంఫౌస్ ఈ వ్యవహారంపై స్పందించారు. హింసను ప్రోత్సహించే ప్రవర్తనను ఉపేక్షించేది లేదన్నారు. ఇది వర్సిటీ విలువలకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. విద్యార్థి పేరు వెల్లడించకపోయినా, అతను ఇక యూనివర్సిటీలో చదవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యంపై ఆందోళన ఏర్పడుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు అందరూ విలువ ఇవ్వాలి కానీ, అది మరొకరి ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని కించపరిచేలా ఉండకూడదు. ఒక వ్యక్తిపై హత్యకు సంబంధించిన సంఘటనను అపహాస్యం చేయడం ఏమాత్రం అంగీకరించదగిన విషయం కాదు. ఇలాంటి ఘటనలు మిగతా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రజల భద్రత, ప్రశాంతమైన క్యాంపస్ వాతావరణం కోసం యూనివర్సిటీ తీసుకున్న తక్షణ నిర్ణయం అభినందించదగ్గ విషయం.
