
చార్లీ భారతీయుల్ని ముందే హెచ్చరించాడా ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాల రుసుము లక్ష డాలర్లకు పెంచిన సందర్బంలో ఇటీవల హత్యకు గురైన కన్జర్వేటివ్ ఉద్యమకారుడు, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ పాత ట్వీట్ ఒకటి తెర మీదకు వచ్చి చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ హెచ్1బీ వీసా రుసుము పెంచకముందే చార్లీ కిర్క్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికాకు భారతీయుల వీసాల అవసరం ఇక లేదంటూ చార్లీ కిర్క్ సెప్టెంబర్ 2న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారతీయులు అమెరికాకు వచ్చింది చాలు, ఇక అమెరికన్లకు ప్రాధాన్యత ఇద్దాం అంటూ రాసుకొచ్చాడు. సెప్టెంబర్ 2న చార్లీ కిర్క్ ఈ ట్వీట్ చేయగా, సెప్టెంబర్ 10న హత్యకు గురయ్యారు.
భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వారికి మరిన్ని వీసాలు ఇవ్వాలని, ఆ విషయం మర్చిపోవద్దు అంటూ అమెరికా టీవీ యాంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు చార్లీ కిర్క్ రీట్వీట్ చేశారు. మరోవైపు హెచ్1బీ వీసాల రుసుము పెంచడంపై సంతకాలు చేసిన తర్వాత ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ప్రతిభ గలవారు వస్తారు, మనకు డబ్బు చెల్లిస్తారంటూ వ్యాఖ్యానించారు. అమెరికన్ కంపెనీలు శిక్షణ ఇవ్వాలనుకుంటే, అమెరికాలోని కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని అమెరికా కామర్స్ సెక్రటరీ హొవార్డ్ లుట్నిక్ అన్నారు. వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు. అమెరికాలోని ఉద్యోగాల కోసం విదేశీయులను తీసుకురావడం ఆపండని కంపెనీలకు సూచించారు.
ట్రంప్ హెచ్1బీ వీసాల రుసుము పెంచడంతో భారత పారిశ్రామిక వేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిభ గల భారత నిపుణులు దేశానికి తిరిగి రావాలని కోరుతున్నారు. వారి నైపుణ్యాన్ని భారత్ కోసం వినియోగించాలని , తద్వార దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నారు. అమెరికా వాణిజ్య సుంకాల నేపథ్యంలో ఆందోళన చెందిన భారత పారిశ్రామిక వేత్తలు హెచ్1బీ వీసా రుసుము విషయంలో ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ట్రంప్ చర్య భారత్‌కే మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
