
చరిత్ర లిఖించిన స్కేటర్ ఆనంద్కుమార్
చైనాలో జరిగిన 2025 స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత స్కేటర్లు ఆనంద్కుమార్ వెల్కుమార్, క్రిష్ శర్మ ఇద్దరూ తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. దక్షిణ కొరియా, కొలంబియా, ఇటలీ వంటి దేశాల ఆధిపత్యం ఉన్న ఈ క్రీడలో భారత్కు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్స్ రావడం ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన విజయం భారత క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
ప్రపంచ ఛాంపియన్ ఆనంద్కుమార్
22 ఏళ్ల ఆనంద్కుమార్ వెల్కుమార్ సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్లో 1:24.924 సమయంతో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయానికి ఒక రోజు ముందు ఆయన 500 మీటర్ల స్ప్రింట్లో 43.072 సెకన్లతో కాంస్య పతకం గెలుచుకుని, సీనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికలపై ఆనంద్కుమార్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ ఈ క్రీడలో భారతదేశానికి సరికొత్త గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెంగ్డులో జరిగిన ప్రపంచ క్రీడల్లో 1000 మీటర్ల స్ప్రింట్లో కాంస్యం సాధించి, ప్రపంచ క్రీడల్లో భారతదేశానికి తొలి రోలర్ స్పోర్ట్స్ పతకాన్ని అందించాడు. ఆనంద్కుమార్ అద్భుతమైన విజయానికి తోడు, యువ స్కేటర్ క్రిష్ శర్మ కూడా జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్లో స్వర్ణం సాధించి భారతదేశ కీర్తిని మరింత పెంచాడు.
ప్రధాని ప్రశంసలు
ఆనంద్కుమార్ వెల్కుమార్ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఆనంద్కుమార్, క్రిష్ శర్మలను అభినందించారు. ‘స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో సీనియర్ పురుషుల 1000మీ స్ప్రింట్లో స్వర్ణం గెలిచిన ఆనంద్కుమార్ వెల్కుమార్కు అభినందనలు. అతడి పట్టుదల, వేగం, క్రీడా స్ఫూర్తి అతడిని స్కేటింగ్లో భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్గా నిలిపాయి. అతడి విజయం ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తుంది. ఆనంద్కుమార్ భవిష్యత్ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. క్రీడల మంత్రిత్వ శాఖ కూడా ఈ విజయాలపై ఆనందాన్ని వ్యక్తం చేసింది.
