
చమురు బంధం పదిలం.. భారత్ వైఖరిలో మార్పు లేదు: రష్యా
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన వైఖరి మార్చుకుందన్న అమెరికా వాదనలను రష్యా తీవ్రంగా ఖండించింది. భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుందని నమ్మడానికి ఎటువంటి కారణం లేదని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల అటు భారత్‌కు, ఇటు రష్యాకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వం నెలకొంటుందని మాస్కో అభిప్రాయపడింది.
అమెరికా 'డిక్టేటర్' ధోరణిపై ఆగ్రహం
రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తన వారంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోల తీరుపై నిప్పులు చెరిగారు. "స్వతంత్ర దేశాలకు ఏం చేయాలో నిర్దేశించే హక్కు తమకు ఉందని వారు భావిస్తున్నారు. వారి ప్రకటనల్లో కొత్తదనమేమీ లేదు" అని ఆమె ఎద్దేవా చేశారు. భారత్ రష్యా చమురును ఆపేసిందని అమెరికా చేస్తున్న ప్రచారంలో పస లేదని ఆమె కొట్టిపారేశారు.
సుంకాల తగ్గింపు.. ఒప్పందం వెనుక అసలేమిటి?
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తర్వాత ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తూ ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆగ్రహించిన ట్రంప్.. గతేడాది ఆగస్టులో భారత్‌పై అదనంగా విధించిన 25 శాతం సుంకాన్ని కూడా తొలగించారు. ఈ ఒప్పందంతో భారత్ ఇకపై రష్యా చమురును కొనబోమని హామీ ఇచ్చిందని ట్రంప్, రూబియోలు గత వారం నుంచి ప్రచారం చేస్తున్నారు.
భారత్ మౌనం.. రష్యా అనుమానం
అమెరికా చేస్తున్న ఈ వాదనలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, కొద్ది రోజుల క్రితమే భారత్ స్పందిస్తూ.. తమ ఇంధన అవసరాల విషయంలో జాతీయ ప్రయోజనాలే గీటురాయి అని స్పష్టం చేసింది. రష్యా మాత్రం అమెరికా తన ఆర్థిక పరపతిని, సుంకాలను, ఆంక్షలను అడ్డం పెట్టుకుని భారత్ వంటి దేశాలను బెదిరిస్తోందని ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న ఐరోపా దేశాలు శాంతిని కోరుకోవడం లేదని జఖరోవా విమర్శించారు.
