Let's talk: editor@tmv.in
చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లు కుదేలు

చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లు కుదేలు

Pinjari Chand
12 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర పతనాన్ని చవిచూశాయి. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్‌ , ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 దాదాపు 2 శాతం మేర పడిపోయాయి. 30 షేర్లతో కూడిన సెన్సెక్స్ 1,342.27 పాయింట్లు లేదా 1.72 శాతం పడిపోయి 76,863.71 వద్ద ముగిసింది. రోజు మధ్యలో ఇది 1,446.72 పాయింట్లు వరకు పడిపోయి 76,759.26కు చేరింది. బీఎస్‌ఈలో మొత్తం 2,380 షేర్లు పడిపోగా, 1,881 షేర్లు పెరిగాయి; 153 షేర్లు మార్పు లేకుండా ముగిశాయి. 50 షేర్లతో కూడిన నిఫ్టీ 394.75 పాయింట్లు/ 1.63 శాతం పడిపోయి 23,866.85 వద్ద ముగిసింది.

లాభాల్లో ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా

సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్ అత్యధికంగా 5 శాతం పడిపోయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ లిమిటెడ్ షేర్లు కూడా పడిపోయాయి. మరోవైపు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (సన్ ఫార్మా), ఎన్‌టీపీసీ లిమిటెడ్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.55 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.61 శాతం పడిపోయాయి. ముఖ్యంగా ఆటో రంగం షేర్లు సుమారు 3 శాతం తగ్గాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, సరఫరా గొలుసు సమస్యలు, ముఖ్యంగా సెమీకండక్టర్ కొరత ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు తెలిపారు. ఆయా రంగాల వారీగా చూస్తే ఆటో సూచీ 3.06 శాతం, బ్యాంకెక్స్ 2.06 శాతం, ప్రైవేట్ బ్యాంకులు 2.03 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.99 శాతం, కన్స్యూమర్ డిస్క్రెషనరీ 1.89 శాతం, పీఎస్‌యూ బ్యాంకులు 1.87 శాతం తగ్గాయి. అయితే ఎనర్జీ, హెల్త్‌కేర్, యుటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ రంగాల సూచీలు కొంత లాభపడ్డాయి.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగిందని, దీనితో పాటు విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచిందని విశ్లేషకులు తెలిపారు. రూపాయి బలహీనత కూడా పెట్టుబడిదారుల భావోద్వేగాన్ని ప్రభావితం చేసింది.

పెరిగిన చమురు ధర

అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్‌ ధర 5.76 శాతం పెరిగి బ్యారెల్‌కు 92.86 డాలర్లకు చేరింది. మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐఎస్) రూ.4,672.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐఎస్) రూ.6,333.26 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎక్స్చేంజ్ గణాంకాలు తెలిపాయి. ఆసియా మార్కెట్లలో నిక్కెయ్ 225, కోస్పి సూచీలు లాభాల్లో ముగిశాయి. షాంగాయ్ కంపోజిట్‌ కూడా పాజిటివ్‌లో ముగిసింది. అయితే హ్యంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ తగ్గుదలతో ముగిసింది. యూరప్ మార్కెట్లు మధ్యాహ్న ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగాయి. అమెరికా, భారత్‌లో విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ పరిస్థితులపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లు జాగ్రత్త ధోరణిలోనే ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 639.82 పాయింట్లు పెరిగి 78,205.98 వద్ద ముగియగా, నిఫ్టీ 233.55 పాయింట్లు పెరిగి 24,261.60 వద్ద ముగిసింది.

పెట్టుబడిదారుల సంపద రూ.5.14 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. దీనివల్ల పెట్టుబడిదారుల సంపద ఒకే రోజులో రూ.5.14 లక్షల కోట్లు తగ్గింది.మార్కెట్ పతనంతో బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,41,90,196.39 కోట్లకు తగ్గింది. ఇది సుమారు 5.14 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని సూచిస్తోంది.

చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లు కుదేలు - Tholi Paluku