
చైనా పారా బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ల హవా
చైనా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2025లో భారత పారా షట్లర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశానికి పతకాలు సాధించి పెట్టారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ ప్రమోద్ భగత్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వచ్చి ఒక స్వర్ణ పతకం, ఒక రజతంతో మెరిశారు. అలాగే సుకాంత్ కదమ్ రెండు రజతాలు, కృష్ణ నాగర్ ఒక రజతం గెలుచుకున్నారు.
ప్రమోద్ భగత్: గోల్డెన్ రిటర్న్
18 నెలల తర్వాత అంతర్జాతీయ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన ప్రమోద్ భగత్, మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో బంగారు పతకం సాధించారు. ఇండోనేషియాకు చెందిన ముహ్ అల్ ఇమ్రాన్‌తో జరిగిన ఫైనల్‌లో తొలి గేమ్ 15-21తో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 21-19, 21-16 తేడాతో విజయం సాధించి పసిడిని కైవసం చేసుకున్నారు. తన విజయంపై ప్రమోద్ సంతోషం వ్యక్తం చేస్తూ, ‘ఈ స్వర్ణ పతకం నాకు చాలా ప్రత్యేకమైనది. 18 నెలల తర్వాత తిరిగి వచ్చి, నన్ను నేను మరోసారి నిరూపించుకోవడం అమూల్యమైన అనుభూతి. ఈ కష్ట సమయంలో నన్ను నమ్మిన నా కోచ్‌లకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఇది నా పునరాగమనానికి కేవలం ఆరంభం మాత్రమే’ అని అన్నారు.
అంతేకాకుండా, మెన్స్ డబుల్స్‌లో సుకాంత్ కదమ్‌తో కలిసి ఆడిన ప్రమోద్, ఫైనల్‌లో స్వదేశీ జోడీ జగదీష్ దిలీ, నవీన్ శివకుమార్‌ల చేతిలో 18-21, 22-20, 18-21 తేడాతో ఓడి రజత పతకం గెలుచుకున్నారు.
సుకాంత్ కదమ్‌కు రెండు రజతాలు
ప్రపంచ నంబర్ 1 పారా షట్లర్ సుకాంత్ కదమ్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఫైనల్స్‌కు చేరుకొని రజత పతకం గెలుచుకున్నారు. ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మాజూర్ చేతిలో 9-21, 8-21తో ఓడిపోయినప్పటికీ, తన ప్రదర్శన పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘ఇంత పోటీలో రజతం గెలవడం గౌరవమే, కానీ నేను ఇంకా బాగా ఆడగలనని నాకు తెలుసు. లూకాస్ అద్భుతంగా ఆడాడు, ఈ మ్యాచ్‌ను నేను ఒక గుణపాఠంగా తీసుకుంటాను. రాబోయే టోర్నీలలో రజతాన్ని స్వర్ణంగా మార్చడమే నా లక్ష్యం’ అని సుకాంత్ పేర్కొన్నారు.
కృష్ణ నాగర్‌కు రజతం
టోక్యో పారాలింపిక్స్ ఛాంపియన్ కృష్ణ నాగర్ మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 కేటగిరీలో రజత పతకం సాధించి భారతదేశ పతకాల సంఖ్యను పెంచారు. థాయ్‌లాండ్‌కు చెందిన నత్తాపాంగ్ మీచాయ్‌తో గట్టి పోరాటం చేసి, 22-20, 7-21, 17-21 తేడాతో ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందారు. ‘ప్రతి పతకం నన్ను మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తుంది. ఫైనల్ కఠినంగా ఉంది, నేను ఓడిపోయినప్పటికీ, కోర్టులో నా వంతు ప్రయత్నం చేశాను. ఈ రజతం నేను కష్టపడితే మరింత ముందుకు వెళ్తానని గుర్తు చేస్తుంది. భారతదేశానికి మరిన్ని స్వర్ణ పతకాలు తీసుకురావడానికి కృషి చేస్తా’ అని కృష్ణ నాగర్ అన్నారు.
