
చనిపోయాడని పొరబడి .. బతికున్న ఉన్న వ్యక్తిని మార్చురీకి!
మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తిని చనిపోయాడని పొరబడి, సిబ్బంది బుధవారం రాత్రి మార్చురీ (శవాల గది)కి తరలించారు.
చిన్న గూడూరు మండలం, జయ్యారం గ్రామానికి చెందిన వి. రవి గా గుర్తించారు. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న రవి మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే అతని వద్ద ఆధార్ కార్డు లేకపోవడం, అదేవిదంగా అతనితోపాటు ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అతడిని అడ్మిట్ చేసుకోలేదు. ఆర్థికంగా బలహీనుడైన రవి తన గ్రామానికి తిరిగి వెళ్లడానికి ప్రయాణ ఖర్చు లేకపోవడంతో మూడు రోజులుగా హాస్పిటల్ ప్రాగణంలో గడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం పడిన వర్షాల కారణంగా మార్చరీ రూమ్ దగ్గర ఉన్న బెంచ్ పై పడుకున్న ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా, సిబ్బంది సరైన పరిశీలన చేయకుండానే మరణించాడని భావించి రాత్రి మార్చురీకి తరలించారు.
గురువారం ఉదయం మార్చురీ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్లు (పారిశుద్ధ్య సిబ్బంది) లోపల ఉన్న రవిలో కదలికలు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రవి బ్రతికే ఉన్నట్లు నిర్ధారించుకుని, తక్షణమే అతడిని చికిత్స కోసం ఆసుపత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ వార్డుకు తరలించారు.
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రవి మీడియాతో మాట్లాడుతూ తన దయనీయ పరిస్థితిని వివరించారు. నా దగ్గర డబ్బు లేదు, ఎవరూ తోడు లేరు కాబట్టి నేను గ్రామానికి తిరిగి వెళ్లలేదు. నన్ను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించడంతో కాంటీన్‌లో ఉన్నాను. తర్వాత నన్ను మార్చురీ దగ్గర, ఆపై లోపల పడేసారు. నేను రాత్రంతా నేల మీదే పడుకోవాల్సి వచ్చింది అని కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఘటనపై ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ డా. జగదీష్ స్పందిస్తూ రోగిని ఎందుకు చేర్చుకోలేదనే అంశంతో పాటు, ఎలా మార్చురీకి తరలించారు అనే విషయాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆధార్ కార్డు లేకపోయినా, అటెండర్ లేకపోయినా ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపోతే ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న విధ్వంసకర నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యాన్ని బహిర్గతం చేస్తోందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.
