Let's talk: editor@tmv.in
చనాక-కొరటా ప్రాజెక్టు జాప్యంపై కవిత విమర్శలు

చనాక-కొరటా ప్రాజెక్టు జాప్యంపై కవిత విమర్శలు

Gaddamidi Naveen
4 నవంబర్, 2025

జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ చేరుకున్న కల్వకుంట్ల కవితకు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీలు, తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కొరటా ప్రాజెక్టును సందర్శించిన క‌విత‌, ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

క‌విత మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, గత ప్రభుత్వ కాలంలో దాదాపు 90 శాతం వరకు పూర్తి అయినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని క‌విత‌ విమర్శించారు.

ప్రాజెక్టు కోసం త్రవ్వించిన కాల్వల్లో వరద నీరు నిలిచిపోయి, పలు ప్రాంతాల్లో ఓవర్‌ఫ్లో అవుతుండటంతో రైతుల పంటలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.అదేవిధంగా, కొరట గ్రామంలో ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన 213 మంది ఇంకా తమకు కేటాయించాల్సిన పరిహారం, పునరావాస సౌకర్యాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఆదిలాబాద్ రైతులకు నిజమైన సాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.జిల్లా అభివృద్ధి, వ్యవసాయ పురోగతి కోసం చనాక-కొరటా ప్రాజెక్టు కీలకమని, దీన్ని నిర్లక్ష్యం చేయడం ప్రజల ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యగా ఆమె పేర్కొన్నారు. అలాగే 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కనీసం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు.

చనాక-కొరటా ప్రాజెక్టు జాప్యంపై కవిత విమర్శలు - Tholi Paluku