
చినుకు పడుతుందంటేనే వణుకు పుడుతుంది
వర్షం పడుతుందంటేనే జనం బెంబెలెత్తుతున్నారు. చిన్నపాటి వర్షానికే రాజధానిలో నరకం చూడాల్సి వస్తుంది. ఉదయం ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు మళ్లీ తిరిగి ఏ రాత్రికి వస్తారో కూడా చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతం రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. చీకటి పడుతుందంటేనే వాన దంచి కొడుతోంది. చిన్నపాటి వానకే రోడ్లు జలమయమవుతున్నాయి. వాహనాలు ముంపులో చిక్కుకుపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుండటంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే ఉద్యోగులు వణికిపోతున్నారు. ఈ వర్షాలు మరో నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది, దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
వరదలోనే వాహనాలు
రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల నగరంలోని అనేక లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. గచ్చిబౌలి, మదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, బాలానగర్, దుండిగల్, మణికొండ, బంజారాహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, కోఠి, చాదర్ ఘాట్, అంబర్ పేట, మలక్ పేట్ , దిలుసుఖ్ నగర్ , ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగి, వాహనాలు స్తంభించిపోయాయి. ఫ్లైఓవర్లపై కూడా ట్రాఫిక్ స్తబ్ధుగా మారింది, కొన్ని ప్రాంతాల్లో కార్లు ముంపులో చిక్కుకున్నాయి. బంజారాహిల్స్, హైటెక్సిటీ, లింగంపల్లి ప్రాంతాల్లో సాయంత్రం ట్రాఫిక్ జామ్లు భారీగా ఏర్పడ్డాయి, వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఇరుక్కుపోయారు. ఓల్డ్ సిటీలో రాత్రిపూట కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. అధికారుల సాయం ఆలస్యమవడంతో స్థానికులు స్వయంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్, పంజాగుట్టా, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లో రోడ్లు నదుల్లా మారాయి, ట్రాఫిక్ పోలీసులు, డిసాస్టర్ రెస్పాన్స్ టీములు రంగంలోకి దిగి మార్గాలను క్లియర్ చేశాయి. బస్సులు, క్యాబ్లు ఎక్కినా లాభం లేదు, మెట్రో మాత్రమే ప్రత్యామ్నాయంగా మిగిలింది. కానీ మెట్రోలో కూడా రద్దీ పెరిగి, ప్రయాణం కష్టమవుతోంది.
హైదరాబాదులో నమోదైన వర్షపాతం
హైదరాబాదులో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 100 మిల్లీమీటర్ల నుంచి 184.5 మిల్లిమీటర్ల వరకు వర్షపాతంనమోదైంది.ముషీరాబాద్లో 184.5 మిల్లిమీటర్లు,చిలకలగూడలో 147.5 మిల్లిమీటర్లు, మోండా మార్కెట్ లో 146.8మిల్లి మీటర్లు, న్యూ మెట్టుగూడ, మారేడుపల్లిలో 140.5 మిల్లీమీటర్లు, ముషీరాబాద్ లో 136.5 మిల్లీమీటర్లు, బన్సిలాల్ పేటలో 135 మిల్లీ మీటర్లు, సీతాఫల్ మండిలో 134 మిల్లీ మీటర్లు, పాటిగడ్డలో 128.3మిల్లీ మీటర్లు, శేర్ లింగంపల్లిలో 144.8, మియాపూర్ లో 130.8 మిల్లీ మీటర్లు, లింగంపల్లిలో 130 మిల్లీ మీటర్లు, గచ్చిబౌలిలో 123.5 మిల్లీమీటర్లు, జూబ్లీహిల్స్ లో 108.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మళ్లీ వర్షాలు
వాతావరణ శాఖ మరో నాలుగు రోజుల వరకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, గాలులు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ముంపు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రజలను ఇండోర్స్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే హైదరాబాద్లో జీవనం మరింత కష్టతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలు, డ్రైనేజీ సమస్యలు ఈ ముంపును మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకుంటేనే నగరం తేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
నిజాం కాలం నాటి నాలాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చినుకు పడితే వణికిపోతుంది. నగరం మొత్తం నీటిమయంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. నిజాం కాలం నాటి నాలాల నిర్మాణాలు. హైడ్రా అధికారులు అప్పటికీ కొన్ని చోట్ల ఆక్రమణలను తొలగించినప్పటికీ మళ్లీ రాజకీయ జోక్యంతో షరా మొదలయింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 90 శాతం మునిగిపోతుందంటే ఎవరు కారణమో వేరే చెప్పాల్సిన పనిలేదు. అనేక చోట్ల ముంపు కాలనీలను అధికారులు గుర్తించారు. అక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలో నిర్ణయించినప్పటికీ అది ఏ మేరకు ఫలితం సాధిస్తాయన్నది మాత్రం చెప్పలేం. ఎందుకంటే నాలాల్లో వ్యర్థపదార్థాలతో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉండిపోయి నీరు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి.
మెట్రోనే దిక్కు
ఇక ఐటీ ఉద్యోగులు భారీ వర్షానికి ఆఫీసులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆశించినంతగా అందుబాటులో లేదు. బస్సులు, క్యాబ్ లు ఎక్కినా ఎటువంటి ప్రయోజనం లేదు. బస్సెక్కినా ఇంటికి చేరేవరకు ఎన్నిగంటలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఒకే ఒక ప్రత్యామ్నాయం మెట్రో. మెట్రో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక సమయం లేకుండా, వారం లేకుండా మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో హైదరాబాద్ లో జీవనం మరింత నరకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
