



చదువును భారంగా కాదు.. ఇష్టంగా నేర్చుకోండి: విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపు
విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఐదేళ్లు కష్టపడి చదివితే ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఉద్యోగాలు సాధించే స్థాయికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పోలవరం జిల్లాలోని రాంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీట్ 4.0లో సీఎం పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సమాజానికి విలువైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇప్పటికే సంస్కరణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తేనే ప్రభుత్వం విజయవంతమైందని భావిస్తామని, విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కూ తక్కువ మార్కులే వచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
విద్యా శాఖ బాధ్యతలను స్వయంగా తీసుకోవాలన్న ఆసక్తి లోకేశ్‌కు ఉందని, ప్రభుత్వం చేపట్టిన మార్పుల కారణంగా 1.1 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని సీఎం తెలిపారు. గతంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సరైన అనుసంధానం ఉండేదికాదని, మెగా పేరెంట్-టీచర్ మీట్ ద్వారా ఆ లోటు తీరిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు కూడా రత్నాల్లా వెలుగుతారని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఐఐటీ కోచింగ్
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలకు అందించగలిగే నిజమైన ఆస్తి విద్యేనని పేర్కొంటూ, గతంలో విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ప్రతిభ చాటుతున్నారని గుర్తుచేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, అసమానతలు తగ్గించేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
అంతకుముందు ప్రభుత్వం ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించిన చంద్రబాబు, తాను 16 ఏళ్ల పాలనలో 14 డీఎస్సీ నియామకాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని వెల్లడించారు.
తల్లికి వందనం భరోసా
కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై 'తల్లికి వందనం' పథకం నిధులు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం అందడంతో పిల్లల చదువును కొనసాగించే ధైర్యం పెరిగిందని గిరిజన తల్లులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు బోధన ప్రమాణాలు, పరిశుభ్రమైన పోషకాహారం అందుతున్నాయని, దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరిగిందని వారు చెప్పారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల చిన్న వ్యాపారాల కోసం సమీప పట్టణాలకు వెళ్లడం సులభమై కుటుంబ ఆదాయం పెరిగిందని వివరించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొద్దిసేపు ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను పరిశీలించి, వారి విద్యా ప్రగతి, హాజరు, ఆరోగ్య వివరాలను తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను వారి ఇళ్లకే చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తరగతి గదుల్లో స్మార్ట్‌బోర్డుల వినియోగాన్ని కూడా పరిశీలించారు.
గ్రీన్ పాస్‌పోర్ట్ - మొక్కల పెంపకం
పాఠశాల ఆవరణలో విద్యార్థులు పెంచుతున్న మొక్కలను పరిశీలించిన సీఎం వారిని అభినందించారు. ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ అమర్చి, స్కాన్ చేస్తే ఆ మొక్క వివరాలు తెలుసుకునే విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులకు గ్రీన్ పాస్‌పోర్టులు అందజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుకు విద్యార్థులు చురుకుగా ముందుకు రావాలని, తాము దత్తత తీసుకున్న మొక్కలను సంరక్షించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్‌కు గిరిజన మహిళలు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి, గిరిజన మహిళలతో సెల్ఫీలు దిగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు.
