Let's talk: editor@tmv.in
చంద్రబాబు మళ్లీ పాత స్ట్రాటజీ

చంద్రబాబు మళ్లీ పాత స్ట్రాటజీ

FL - SIMHCLM
23 సెప్టెంబర్, 2025

రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఎప్పట్లానే పాత బాణీని అనుసరిస్తున్నారు. తాను నీతికి నిజాయితీకి విలువలకు ప్రతిరూపం అని తరచూ చెబుతూనే ఆ విలువలకు తిలోదకాలు ఇస్తూ రావడం గతంలో కూడా గమనించారు ప్రజలు. 2014-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ తరఫున గెలిచిన దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి పేరిట తమ పార్టీలో చేర్చుకున్నారు. అందులో అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావును కూడా చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో అలా చేర్చుకున్నవారిలో ఇద్దరు మినహా మిగతా ఎవరూ గెలవలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మళ్లీ చంద్రబాబు వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ అనే ముగ్గురు ఎమ్మెల్సీలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్నారు. వాస్తవానికి వారిని చేర్చుకోవడం ద్వారా తక్షణం చంద్రబాబుకు కలిగే ప్రయోజనం ఏముందో కానీ మళ్లీ ఎప్పట్లానే అనైతిక రాజకీయాలకు అయన తెరలేపుతున్నారు అనే వాదన మాత్రం మళ్లీ మొదలైంది.

వాస్తవానికి ఇటీవల తెలుగుదేశంలో చేర్చుకున్న ఈ ముగ్గురూ పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా లేనివాళ్లే. బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. అయితే అయన తండ్రి బల్లి దుర్గా ప్రసాద్ తిరుపతి ఎంపీగా ఉండగా కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో అయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇక చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి చాన్నాళ్లయింది. కర్రీ పద్మశ్రీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో హుషారుగా లేనివారే.. కానీ కులసమీకరణల నేపథ్యంలో కాకినాడకు చెందిన ఈమెకు 2023లో జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చేరారు. అయితే వల్ల టీడీపీకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మున్ముందు తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు మళ్లీ పాత స్ట్రాటజీ - Tholi Paluku