
చంద్రుడిపై ఖనిజ సంపద
చంద్రుడిపై దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లక్షల ఏళ్లుగా ఉల్కల ఢీకొనడంతో ఏర్పడిన చంద్రుడి క్రేటర్లలో ప్రముఖమైన ప్లాటినం-గ్రూప్ లోహాలు దాగి ఉన్నాయని వారు భావిస్తున్నారు. వీటిలో ప్లాటినం, పెల్లాడియం, రోడియం వంటి లోహాలు ఉంటాయి. ఇవి భూమిపై అత్యంత అరుదైనవే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ, వైద్య రంగంలోనూ కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఈ లోహాలను సాధారణంగా భూమి మీద తీయడం పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఉంటుంది. అందుకే ఖనిజ తవ్వకాలకు భవిష్యత్తులో చంద్రుడు ఒక ప్రధాన గమ్యస్థానంగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ అధ్యయనం ప్రకారం చంద్రుడిపై దాదాపు 6,500 క్రేటర్లు విలువైన లోహాలు కలిగి ఉండవచ్చు. వీటితో పాటు సుమారు 3,400 క్రేటర్లలో నీటి ఆనవాళ్లు దొరకే అవకాశం ఉందని అంచనా. ఈ నీరు ఖనిజ రూపంలో, హైడ్రేటెడ్ మినరల్స్ రూపంలో దాగి ఉండవచ్చు. అంతరిక్ష అన్వేషణకు భవిష్యత్తులో ఇలాంటి నీటి వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే చంద్రుడి మీదే ఇంధనం తయారు చేయడం, మానవ మిషన్లకు అవసరమైన తాగునీరు అందించడం సులభమవుతుంది. భూమి చుట్టూ తిరిగే ఉల్కలలో ఉండే లోహ నిల్వల కంటే చంద్రుడిపై ఉండే ఖనిజ సంపద 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని కొత్త అధ్యయనం స్పష్టం చేసింది. దీని అర్థం, కక్ష్యలో తిరుగుతున్న ఉల్కల కంటే చంద్రుడిపై తవ్వకాలు చేయడం మరింత లాభదాయకంగా ఉండవచ్చని సూచిస్తోంది.
భూమిపై లభించే సహజ వనరులు వేగంగా తగ్గిపోతుండగా, భూమిపై తవ్వకాలు చేయడం కాలుష్యాన్ని పెంచి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో అంతరిక్ష తవ్వకాలు భవిష్యత్తులో ఒక అల్టెర్‌నెట్‌గా ముందుకు వస్తున్నాయి. చంద్రుడు కేవలం భూమికి సమీపంగా ఉండటం వల్లే కాకుండా, దాని స్థిరమైన కక్ష్య కారణంగా కూడా తవ్వకాల చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాడు. ఇటు ఉల్కలు ఢీకొనేటప్పుడు పదార్థం ఆవిరైపోయినా, కొంత భాగం మాత్రం క్రేటర్ల మధ్యభాగంలో నిలిచి ఉంటుంది. ఈ కారణంగా క్రేటర్లను సమగ్రంగా పరిశీలిస్తే విలువైన లోహాలు, నీటి ఆనవాళ్లు దొరకవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రుడిని ఇకపై కేవలం రాత్రి ఆకాశంలో మెరిసే శాటిలైట్‌లా కాకుండా, భవిష్యత్తులో మానవ జాతికి కొత్త వనరుల భాండాగారంగా కూడా చూడాల్సిన సమయం వచ్చిందని ఈ అధ్యయనం స్పష్టంగా చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుడి వనరులను వినియోగించగలిగితే అంతరిక్ష అన్వేషణలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
