Let's talk: editor@tmv.in
చిత్తూరు జిల్లాలో కొత్త యూనివర్సిటీ

చిత్తూరు జిల్లాలో కొత్త యూనివర్సిటీ

FL - SUNL
25 సెప్టెంబర్, 2025

చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ... గత ఏడాది నవంబర్ లో గురజాల ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ రంగంలో ద్రవిడియన్, ప్రైవేటురంగంలో అపోలో వర్సిటీలు ఆ జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు వర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ద్రవిడియన్ వర్సిటీ చిత్తూరులో ఉన్నప్పటికీ అది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్సిటీ, కలసికట్టుగా పనిచేసి, చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.

తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడులో హైస్కూలును జూనియర్ కాలేజిగా అప్ గ్రేడ్ చేయాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య కోరగా, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ... గతసర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. హైస్కూలు ప్లస్ విధానంతో కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కళాశాలల్లో 40శాతం అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం, కాంపిటీటీవ్ మెటిరీయల్ ఇస్తున్నాం. ఎగ్జామ్స్ కు అవసరమైన మెటీరియల్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందిస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతాం. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం, దానికి కట్టుబడి ఉన్నాం. తుని ఎమ్మెల్యే దివ్య చేసిన విజ్ఞప్తిపై వివరాలు తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటాం, రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

మెగా డిఎస్సీ వేడుకకు ఎమ్మెల్యేలకు ఆహ్వానం

రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు, దీనిద్వారా సుమారు 16వేలమందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత అయిదేళ్లలో ఒక్క డిఎస్సీ ఏర్పాటుచేయలేదు. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. రేపు కొత్త ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులమీదుగా నియామక ఉత్తర్వులు అందించబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణం. ఎమ్మెల్యేలంతా హాజరై జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం.

ప్రతిపక్ష సభ్యులకు కూడా జిఎడి ద్వారా ఆహ్వానం పంపించాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని కూడా కోరుతున్నామని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైసిపి వారు సుమారు వందకు పైగా కేసులు వేశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. రేపు సచివాలయం వెనుక వైపు నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతోపాటు వారి కుటుంబసభ్యులు కలిసి సుమారు 32వేలమంది హాజరుకాబోతున్నారు. వేదిక వద్ద ప్రతిజిల్లాకు ఒక్కొక జోన్ ఏర్పాటుచేశాం. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. స్థలాభావం వల్ల అందరికీ బస్సులు ఏర్పాటుచేశామని చెప్పారు. శాసనమండలి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ.. డిఎస్సీ విషయంలో మంత్రి లోకేష్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారని ప్రశంసించారు.

చిత్తూరు జిల్లాలో కొత్త యూనివర్సిటీ - Tholi Paluku