
చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదు.. జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ లేఖ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని కోరుతూ ప్రత్యేక విచారణ బృందం (సిట్) పంపిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. సిట్ అధికారుల తీరు రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పులను వారు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సిట్ అధికారులకు కేసీఆర్ ఘాటుగా ప్రత్యుత్తరం ఇచ్చారు. చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదని, నోటీసు ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని లేఖలో పేర్కొన్నారు.
మొన్న రెండు సార్లు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులు చట్టబద్ధంగా లేవని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి నోటీసు అందినప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో వేరే తేదీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అదే సమయంలో, 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటే విచారించాలని స్పష్టంగా పేర్కొన్న సెక్షన్ 160 సీఆర్పీసీ నిబంధనలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే, భవిష్యత్తులో వచ్చే అన్ని నోటీసులను ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని సూచించినట్లు వెల్లడించారు.
అయితే, ఇవన్నీ తెలియజేసిన తర్వాత కూడా సిట్ అధికారుల సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటల సమయంలో నందినగర్‌లోని తన ఇంటి గోడకు అతికించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీరు స్వయంగా చేశారా, లేక మీ ఆదేశాల మేరకే జరిగిందా అన్నది ఏదైనా సరే, ఆ చర్యను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారం భారత రాజ్యాంగం, చట్టాలు, అలాగే సుప్రీంకోర్టు పట్ల సిట్ అధికారులకు ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని ఆయన విమర్శించారు.
సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ కేసులో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా సిట్ అధికారులు పట్టించుకోలేదని కేసీఆర్ తెలిపారు. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధం కాదని, నోటీసులు చట్టం నిర్దేశించిన విధానంలోనే ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసు వ్యక్తిగతంగా అందజేయాల్సి ఉండగా, కావాలనే చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాను సిట్ అధికారుల పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదని, కాబట్టి తనకు నోటీసులు ఇచ్చే అధికార పరిధి సిట్‌కు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడన్నదే ముఖ్యమని, తాను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నానన్నది నిర్వివాద అంశమని తెలిపారు. హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసులు ఇచ్చారని గుర్తుచేస్తూ, ఇది సిట్ అధికారుల ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతోందని విమర్శించారు.
చట్టపరమైన అంశాలన్నింటిని ప్రస్తావించినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. అందుకే నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని, సిట్ అధికారులు అక్కడే తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
