
చట్టప్రకారమే హెచ్‌డీ రేవన్న అరెస్ట్ : సీఎం సిద్ధరామయ్య
జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్నను చట్ట ప్రకారమే అరెస్ట్ చేశారని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తన కుమారుడు, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళను అపహరించిన కేసులో హెచ్‌డీ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ చేసిన ఆరోపణలను సీఎం ఖండించారు. జేడీఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటామన్న వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధరామయ్య, జేడీఎస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. ఈ కేసులో మాత్రమే కాదు… ఏ కేసులోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోదు. చట్టం తన పని తాను చేసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చట్టబద్ధంగానే వ్యవహరిస్తోందని, జేడీఎస్ రాజకీయ విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. వారు అధికారంలోకి వస్తామంటున్నారు. కానీ 17 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారు? రాజకీయ ప్రసంగాలు వాస్తవంగా మారవని వ్యాఖ్యానించారు. రేవన్న కేసును ‘ఫిక్స్’ చేయడానికి అధికారులకు బహుమతులు ఇచ్చారన్న ఆరోపణలను సీఎం తీవ్రంగా ఖండించారు.
ఈ ఆరోపణలన్నీ అసత్యం. ఎవరు బహుమతులు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఇటీవల ప్రజ్వల్ రేవన్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందానికి రూ.25 లక్షల బహుమతి ఇచ్చినట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును వదులుకుంటుందా?
బీజేపీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న వాదనపై స్పందించిన సీఎం ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ తమ ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కు వదులుకుంటుందా? అని ప్రశ్నించారు. బీజేపీ–జేడీఎస్ కలిసి పోటీ చేసినా మేము 136 సీట్లు గెలిచాం. ఇప్పుడు మా బలం 140కి చేరింది. జేడీఎస్ వద్ద ఎన్ని సీట్లు ఉన్నాయి? కేవలం 17 మాత్రమే అని గుర్తుచేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ విషయమై స్పందించిన సీఎం బడ్జెట్ తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి 2 నుంచి ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలపై మాట్లాడుతూ, కర్ణాటకకు మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన, లేనివారు రెండువర్గాల మానవ వనరులు ఉన్నాయని, వారికి శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు.
జనవరి 22న జరిగిన సంఘటనలపై గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక పంపడంపై ఆ రోజు జరిగిన విషయాలనే గవర్నర్ నివేదించారని సీఎం అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించాల్సిందేనని, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవాల్సి ఉండేదని సీఎం పేర్కొన్నారు. ఆ రోజు గవర్నర్ 122 పేరాగ్రాఫ్‌ల ప్రసంగంలో కేవలం మూడు లైన్లు మాత్రమే చదివారని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రసంగ పాఠ్యాన్ని ఇస్తుంది. ప్రసంగించేది గవర్నరే అని అన్నారు. అవసరమైతే మార్పులకు అవకాశం ఉందని చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టాబ్లో అంశంపై కేంద్రానికి లేఖ రాయలేదన్న బీజేపీ ఆరోపణలను సీఎం ఖండించారు. మేము లేఖ రాశాం. ఎంపిక చేయకపోతే మేం ఏం చేయగలం? ప్రతి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని అన్నారు.
