Let's talk: editor@tmv.in
చట్టం ముందు అందరూ సమానమే: బీజేపీ కో ఇన్‌చార్జ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య

చట్టం ముందు అందరూ సమానమే: బీజేపీ కో ఇన్‌చార్జ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య

Pinjari Chand
3 నవంబర్, 2025

బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రచారాలతో కూటములు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. నాయకుల మాటాల తుటాలు ప్రచార సభలను మరింత ఉద్విగ్నంగా మారుస్తున్నాయి. ఇటీవల మోకామాలో జన్ సురాజ్ నాయకుడు దులర్ చంద్ యాదవ్ హత్య కలకలం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో జేడీయూ నేత, అభ్యర్థి అనంత్‌ కుమార్‌ సింగ్‌ అరెస్టుతో పొలిటికల్ స్టేజ్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, బీహార్‌ బీజేపీ కో ఇన్‌చార్జ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పందించారు. అనంత్‌ సింగ్‌ అరెస్టు నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని బీహార్‌ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని, చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే స్పష్టమైన సందేశం అని పేర్కొన్నారు.

చట్టం ముందు ఎవరికి మినహయింపు లేదు

బీహార్‌లో చట్టం, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో వివక్ష లేకుండా అందరికీ సమాన న్యాయం జరుగుతోంది. అనంత్‌ సింగ్‌ అరెస్టు దానికి నిదర్శన అని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. అలాగే ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తామని చేసిన ప్రకటనపై కూడా మౌర్య విమర్శలు గుప్పించారు. ఆర్‌జేడీ గెలిచిన ప్రతి ఒక్కరిని డిప్యూటీ సీఎంలుగా చేసినా ఆ కూటమికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్‌తో కలిసి నడిచే మహాఘట్భంధన్‌ బీహార్‌లో ప్రభావం చూపే పరిస్థితి లేదు. 50 సీట్ల మార్క్‌ దాటితే అదో ఘనవిజయం అవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్ట్

అక్టోబర్‌ 30న మోకామాలో జరిగిన జన్ సురాజ్ ఎన్నికల ప్రచార సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో జనసురాజ్‌ అనుచరుడు దులర్‌చంద్‌ యాదవ్‌ హతమయ్యాడు. ఈ కేసులో అనంత్‌ సింగ్‌తో పాటు ఆయన అనుచరులు మణికాంత్‌ ఠాకూర్‌, రంజీత్‌ రామ్‌లను పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. అరెస్టు అనంతరం అనంత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. “సత్యమే వజ్రాయుధం. మోకామా ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మోకామా ప్రజలే పోరాడతార అని ఆయన పేర్కొన్నారు.

మోకామాలో హై వోల్టేజ్‌ పోరు

నవంబర్‌ 6న జరగనున్న తొలి దశ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోకామా మరోసారి ఉత్కంఠ భరిత రంగస్థలంగా మారుతోంది. జేడీయూ నుంచి అనంత్‌ సింగ్‌, ఆర్‌జేడీ నుంచి మాజీ ఎంపీ సురజ్‌భాన్‌ సింగ్‌ భార్య వీణా దేవి ఇద్దరూ భూమిహార్‌ వర్గానికి చెందినవారే కావడంతో ఈ పోటీ కులపరంగా, రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. జన్ సురాజ్ నుంచి పీయూష్ ప్రియదర్శిని పోటీలో ఉన్నారు.

అనంత్ సింగ్ అరెస్టు జరగాల్సిందే: తేజప్రతాప్

జనశక్తి జనతా దళ్‌ (జేజేడీ) చీఫ్‌ తేజప్రతాప్‌ యాదవ్‌ మాట్లాడుత ఈ అరెస్టు తప్పదు. జరగాల్సిందే. పలు నేరాల్లో కేసులు నమోదైన వ్యక్తి ఎప్పటికైనా చట్టం ముందుకు రాక తప్పదు. జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌పై అనేక కేసులు ఉన్నాయి. ఇది సహజ పరిణామ అని స్పష్టం చేశారు.

చట్టం ముందు అందరూ సమానమే: బీజేపీ కో ఇన్‌చార్జ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య - Tholi Paluku