
చంద్రుడి వైపు దూసుకెళ్తున్న ఆర్టెమిస్-II వ్యోమగాములు
చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్–II మిషన్ వ్యోమగాములు ఇప్పటికే తమ ప్రయాణంలో సగానికి పైగా దూరం పూర్తి చేశారు. చంద్రుడిని చుట్టి తిరిగి భూమికి చేరే ఈ చారిత్రాత్మక మిషన్ ద్వారా గతంలో అపోలో 13 మిషన్ సృష్టించిన రికార్డును అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాసా చేపట్టిన ఈ మిషన్‌లో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములు, ఒక కెనడా వ్యోమగామి ఉన్నారు. వీరు సోమవారం చంద్రుడి సమీపానికి చేరుకొని చంద్రుడి వెనుక భాగం (లూనార్ ఫార్‌సైడ్)ను చిత్రీకరించనున్నారు. 53 సంవత్సరాల తరువాత చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న తొలి మానవ బృందం ఇదే కావడం విశేషం. ఈ మిషన్‌లో వ్యోమగాములు 4 లక్షల కిలోమీటర్లకు పైగా (సుమారు 2.52 లక్షల మైళ్లు) భూమి నుంచి దూరం వెళ్లి, చంద్రుడి వెనుక భాగంలో యూ-టర్న్ తీసుకుని తిరిగి భూమికి చేరుకోనున్నారు. చంద్రుడిపై దిగకుండా, కక్ష్యలోకి ప్రవేశించకుండా తిరిగి రావడం ఈ మిషన్ ప్రత్యేకత. ఈ బృందంలో కెనడాకు చెందిన జెరేమి హన్‌సెన్ కూడా ఉన్నారు. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న తొలి అమెరికేతర వ్యోమగామి ఆయన కావడం గమనార్హం. కెనడా స్పేస్ ఏజెన్సీ కూడా ఈ మిషన్‌లో తమ దేశం పాత్రపై గర్వం వ్యక్తం చేసింది.
ఈ బృందంలో రీయిడ్ వైస్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ కూడా ఉన్నారు. గ్లోవర్ చంద్రుడి వైపు వెళ్లిన తొలి ఆఫ్రో-అమెరికన్ వ్యోమగామి కాగా, కొచ్ చంద్రుడి వైపు వెళ్లిన తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు కొనసాగే ఈ మిషన్ ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో క్యాప్సూల్ దిగడంతో ముగుస్తుంది. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర స్థావరం ఏర్పాటుకు ఇది తొలి కీలక అడుగు అని నాసా పేర్కొంది. 2028లో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో వ్యోమగాములను దింపాలనే లక్ష్యంతో నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
