
చంద్రయాన్-5పై ఇస్రో ఛైర్మన్ కీలక ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపై తన తదుపరి ప్రయోగాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. చంద్రయాన్-3 సాధించిన అద్భుత విజయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్, ఇప్పుడు చంద్రయాన్-4 ద్వారా జాబిల్లిపై నుంచి మట్టి నమూనాలను భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే చంద్రయాన్-5 ప్రయోగంలో భాగంగా భారీ ల్యాండర్, భారీ రోవర్‌ను పంపనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ బుధవారం వెల్లడించారు. బెంగళూరులో ప్రారంభమైన 'స్టార్ట్-2026' శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని భవిష్యత్ అంతరిక్ష లక్ష్యాలను వివరించారు.
100 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు
గతంలో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో ల్యాండర్ జీవితకాలం కేవలం 14 రోజులు (ఒక చంద్ర పగలు) మాత్రమే ఉండేది. అయితే భవిష్యత్ మిషన్లలో దీనిని సుమారు 100 రోజుల వరకు పెంచాలని ఇస్రో నిర్ణయించింది. కేవలం ల్యాండర్ మాత్రమే కాకుండా, రోవర్ పరిమాణాన్ని కూడా భారీగా పెంచుతున్నారు. చంద్రయాన్-3లో రోవర్ బరువు సుమారు 25 కిలోలు ఉండగా, చంద్రయాన్-5 ప్రయోగంలో దీనిని 350 కిలోలకు పెంచనున్నారు. ఇది చంద్రుడి ఉపరితలంపై మరింత సమర్థవంతంగా, ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు దోహదపడుతుందని ఛైర్మన్ పేర్కొన్నారు.
శుక్రుడు, అంగారక గ్రహాలపై కన్ను
చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపై కూడా ఇస్రో తన పట్టును బిగించనుంది. ఇప్పటికే ‘మంగళయాన్’ విజయవంతం కావడంతో, ఇప్పుడు నేరుగా అంగారక గ్రహంపై వ్యోమనౌకను ల్యాండ్ చేసే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. దీనితో పాటు 'వీనస్ ఆర్బిటర్ మిషన్' (శుక్రుడిపై పరిశోధనలు) ప్రాజెక్టును కూడా చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతుల దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. చంద్రయాన్-3 ద్వారా ఇప్పటికే జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఎనిమిది రకాల ఖనిజాలను గుర్తించామని, భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం
ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో భారత అంతరిక్ష రంగం సరిహద్దులను మరింత విస్తరించింది. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా మరో రెండేళ్లలో భారత అంతరిక్ష యాత్రికులను రోదసీలోకి పంపి, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఇస్రో లక్ష్యం. దీనికి తోడు 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోనుంది. 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపే ప్రణాళికలపై ఇప్పటికే మేధోమథనం ప్రారంభమైందని ఆయన వివరించారు. అటు సూర్యుడిపై అధ్యయనం కోసం పంపిన ఆదిత్య-ఎల్1 ఇప్పటికే భారీగా డేటాను అందిస్తోందని తెలిపారు.
సాంకేతికతలో స్వయం సమృద్ధి
50 ఏళ్ల క్రితం ప్రాథమిక స్థాయిలో ఉన్న భారత్, నేడు సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలను రూపొందించుకునే స్థాయికి చేరిందని నారాయణన్వెల్లడించారు. గతంలో కేవలం ఒక అంగుళం వ్యాసం కలిగిన లెన్స్‌లను వాడేవారమని, నేడు బెంగళూరులోని ‘లియోస్’ ప్రయోగశాలలో 1.7 మీటర్ల వ్యాసం కలిగిన భారీ కెమెరా లెన్స్‌లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చేపట్టిన 'ఆర్టెమిస్' కార్యక్రమంలో భారత్ కూడా భాగస్వామిగా ఉందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో పోటీ పెరుగుతున్న తరుణంలో, వచ్చే తరం యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
