
చంద్రబాబు విజనరీ కాదు
నాయకుడి ఆలోచన ప్రజలకు మేలు చేసేలా ఉంటే విజినరీ అంటారని, కానీ విజనరీగా చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులును ప్రైవేటుపరం చేస్తూ ప్రజలకు కీడు చేస్తున్నారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తీ చేసి, వాటిలో ఐదింటిలో అడ్మిషన్లు ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిర్మాణాలు పూర్తీ అయినా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రెండు కాలేజీలు ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం పేదలకు వైద్యాన్ని దూరం చేయడమేనని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటపరం చేయడం ద్వారా వచ్చే ఆదాయన్ని తన బంధువులకు, పార్టీవారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. పిపిపి విధానంలో నిర్మించడమంటే ప్రైవేటువారికి అప్పగించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడమేనని వ్యాఖ్యానించారు. తద్వారా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వైద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినట్టు అనంత వెకంట్రామిరెడ్డి తెలిపారు.
సేకరించిన సంతకాలను వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గవర్నర్ కు సమర్పిస్తామని తెలిపారు. చంద్రబాబు కుట్రలను అడ్డుకునే బాధ్యతను వైసీపీ తీసుకుందని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని అనంత పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా తరలి వచ్చి సంతకాలు చేశారని అన్నారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ సంతకం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మానుకోవాలని హితవు పలికారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
