
చంద్రబాబు పాలనలో ఆదాయాలు తగ్గి అప్పులు పెరిగాయి: జగన్ తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గిపోతుండగా ఖర్చులు, అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జగన్ తెలిపిన వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఖర్చు రూ.2,36,486 కోట్లు కాగా, అదే ఏడాదిలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1,70,767 కోట్లు మాత్రమేనని చెప్పారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలో ప్రభుత్వ ఖర్చు రూ.2,49,906 కోట్లకు పెరిగిందని, కానీ ఆదాయం మాత్రం రూ.1,68,024 కోట్లకే పరిమితమైందని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రెవెన్యూ లోటు భారీగా పెరిగి రూ.60,285 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇది గతంతో పోలిస్తే సుమారు 56 శాతం పెరిగినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. అలాగే ద్రవ్య లోటు కూడా సుమారు 30 శాతం వరకు పెరిగిందని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అధికంగా అప్పులు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ.3.2 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చారని, తమ ఐదేళ్ల పాలనలో మొత్తం తీసుకున్న అప్పులు రూ.3.31 లక్షల కోట్లే అని ఆయన వివరించారు.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు తగ్గిపోవడానికి కారణం భారీ అవినీతి, వనరుల దోపిడీ అని జగన్ ఆరోపించారు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, గ్రానైట్, భూములు, మద్యం వంటి వనరులలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు కట్టబెట్టి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పారు.
అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన అప్పుల లెక్కలు, కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు సరిపోలడం లేదని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.60,485 కోట్ల అప్పులు తీసుకున్నామని చెబుతుండగా, కాగ్ నివేదిక ప్రకారం, ఆ మొత్తం రూ.81,071 కోట్లుగా ఉందని తెలిపారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యత్యాసం ఉందని ఆయన విమర్శించారు.
సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.1,500 చెల్లించే హామీ, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి పథకాల అమలులో స్పష్టత లేదని అన్నారు. తమ ప్రభుత్వ కాలంలో 66 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇచ్చామని, ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షలకు తగ్గిందని తెలిపారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల బకాయిలు వేల కోట్లకు చేరాయని చెప్పారు.
రైతుల పరిస్థితి కూడా కష్టంగా మారిందని జగన్ పేర్కొన్నారు. మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి వంటి పంటలకు ధరలు పడిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. వ్యవసాయ బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులకు వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మొత్తం మీద ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా నిలిచిపోయాయని జగన్ విమర్శించారు.
