
చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం: వైఎస్ షర్మిల
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి తరలివచ్చిన స్థానికులను ఉద్దేశించి ఆమె ప్రసంగించిన ఆమె ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తెచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టం వల్ల శ్రామికులకు కలిగే నష్టాలను వివరిస్తూ గత మూడు వారాలుగా భీమడోలు మండలంలో కూలీలకు పనులు కల్పించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు పనులు కూడా పండుగలా సాగేవని నేడు శ్రామికులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రతిపాదించిన జనాభా విధానం పై షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే సరైన భవిష్యత్తు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలని చెప్పడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. "మీరిచ్చే 25 వేల రూపాయల కోసం ప్రజలు మూడో బిడ్డను కనాలా? చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బతుకుతుంటే వారి గురించి పట్టించుకోరా? అని నిలదీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి కొత్త పల్లవులు అనుకుంటున్నారని మండిపడ్డారు.
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ గత జగన్ ప్రభుత్వం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్‌ను 12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాయని షర్మిల ఆరోపించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేక ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 6 వేల కోట్లు బకాయిలు పెట్టి సామాన్యుల ఆరోగ్యాన్ని, విద్యార్థుల చదువును పణంగా పెట్టారని విమర్శించారు.
అదేవిధంగా రాష్ట్రంలో అక్రమ మాఫియాలు సాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలను బిడ్డలను కనమని అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ఈ యాత్ర ద్వారా సాధారణ శ్రామికులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
