Let's talk: editor@tmv.in
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి కేసులో నిందితులకు షాకిచ్చిన హైకోర్టు

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి కేసులో నిందితులకు షాకిచ్చిన హైకోర్టు

Panthagani Anusha
16 మార్చి, 2026

నందిగామలో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడి కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో కింది కోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అంతేకాకుండా నిందితులందరూ వారం రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే?

2022 నవంబర్ నెలలో అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు నందిగామలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ పట్టణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో వీధి దీపాలు ఆపివేసి చీకటిని అడ్డుపెట్టుకుని ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో ఫుటేజీలు, సాక్ష్యాధారాల ఆధారంగా కనికంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ వంటి కీలక వ్యక్తులతో పాటు మరికొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై హత్యాయత్నం, కుట్రపూరిత దాడి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మొదట నిందితులు కింది కోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు, బెయిల్‌ను రద్దు చేస్తూ నిందితులు వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా వారు లొంగిపోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.