Let's talk: editor@tmv.in
చంద్రబాబుకు రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందాలు: మాజీ సీఎం జగన్

చంద్రబాబుకు రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందాలు: మాజీ సీఎం జగన్

Pinjari Chand
9 జనవరి, 2026

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు, రాష్ట్ర పారిశ్రామిక పురోగతి, అప్పులు, పన్నుల భారంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతూ జరుగుతున్న అవినీతిపై ఆయన విస్తృతంగా మాట్లాడారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఇష్యూ

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌పై తెలంగాణ సీఎం వ్యాఖ్యలను చంద్రబాబు గానీ, ఆయన మంత్రులు గానీ ఖండించకపోవడం వెనుక రహస్య ఒప్పందం ఉందని జగన్‌ ఆరోపించారు. దేశంలోనే ఇలాంటి చరిత్ర హీనుడు మరెవ్వరూ ఉండరు. రాయలసీమకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు అవసరం లేదని అనడం రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు ఉన్న ఒప్పందానికి ముద్ర వేసినట్లే అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ నీరు లేని ప్రాంతానికి ఒక ఇన్సూరెన్స్‌ పాలసీలా పనిచేస్తుందని, రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి కూడా సంజీవని వంటిదని చెప్పారు. శ్రీశైలం పూర్తి స్థాయి 885 అడుగులు కాగా, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి స్థాయి నీరు రావాలంటే 881 అడుగుల నీరు ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు.

20 ఏళ్లలో 3–4 సార్లు మాత్రమే నీరు

పోతిరెడ్డిపాడు ద్వారా మనకు 101 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ గత 20 ఏళ్లలో కేవలం 3–4 సార్లు మాత్రమే ఆ నీరు వచ్చిందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీల నీరు వివిధ లిఫ్ట్‌లు, పవర్‌హౌజ్‌ల ద్వారా తోడుకుపోతుండగా, చంద్రబాబు మాత్రం అడ్డుకోలేకపోయారని విమర్శించారు. నాగార్జునసాగర్‌, పులిచింతల వద్ద పవర్‌హౌజ్‌లు తెలంగాణ ఆధీనంలో ఉండటంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఈ నిర్ణయాలన్నీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తీసుకున్నవని గుర్తుచేశారు. 2015లో చంద్రబాబు సీఎంగా ఉండగా, తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్‌ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచి, శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీరు తోడేలా తెలంగాణ పని మొదలుపెట్టింది. మరో అడుగు ముందుకేసి 777 అడుగుల స్థాయి నుంచి రోజూ మరో 2 టీఎంసీలు డ్రా చేసేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇవన్నీ ఇలా ఉండగా, 825 అడుగుల నుంచి ఎస్‌ఎల్బీసీ ద్వారా 40 టీఎంసీల నీరు తీసుకెళ్లే పనులు చేశారు. శ్రీశైలం వరకు నీరు రాకముందే జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమ లిఫ్ట్‌ల ద్వారా రోజుకు 1 టీఎంసీల నీరు తరలించేందుకు, శ్రీౖశైలంలో 777 అడుగుల స్థాయి నుంచి ఎడమ విద్యుత్‌ కేంద్రం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఆ స్థాయిలో నీటి దోపిడి జరగ్గా, ఇక్కడ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఇక్కడ ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుంటే, అక్కడ లిఫ్ట్‌లు, పవర్‌ హౌజ్‌ ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు పలు మార్గాల్లో 8 టీఎంసీల నీరు తోడేసే పరిస్థితి. ఇక ఇక్కడ చూస్తే, తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితి. కింద నాగార్జునసాగర్‌ వద్ద కూడా ఎడమ కాల్వ ఆపరేషన్స్, లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌హౌజ్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉన్నాయి. ఇంకా రైట్‌ బ్యాంక్‌ ఆపరేషన్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక, దాన్ని స్వాధీనం చేసుకున్నాం. సాగర్‌ కింద పులిచింతల. అక్కడా పవర్‌హౌజ్‌ తెలంగాణ చేతిలో ఉంది. మన రాష్ట్రానికి అన్ని విధాల నష్టం చేస్తున్న ఆ నిర్ణయాలన్నీ, చంద్రబాబు సీఎం అయ్యాకే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది. కానీ, అప్పట్లోనే నేను విపక్షనేతగా కర్నూలులో జలదీక్ష చేశానని గుర్తు చేశారు.

వైయస్సార్‌సీపీ హయాంలో చర్యలు

2019లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో అనుమతులు లేకుండా సాగుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవడంతో 2021లో ఎన్జీటీ ఆదేశాలు, 2022లో తెలంగాణపై రూ.920 కోట్ల జరిమానా విధించిందన్నారు. అదే సమయంలో మన రాష్ట్రం రోజుకు కేవలం 0.3–0.33 టీఎంసీల నీరు మాత్రమే తీసుకునే పరిస్థితి ఉందని తెలిపారు.

రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ అవసరం

చంద్రబాబు రాయలసీమలో పుట్టినా ఆ ప్రాంతం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని జగన్‌ విమర్శించారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీరు తీసుకునేలా రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ను చేపట్టి రూ.990 కోట్లు ఖర్చు చేసి కీలక పనులు చేశామన్నారు. జగన్‌కు పేరు వస్తుందన్న ఒక్క కారణంతోనే టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ఒక టీడీపీ కార్యకర్తతో తెలంగాణలో కేసు వేయించి అడ్డుకుందని ఆరోపించారు. ఈ స్కీమ్‌ ద్వారా గండికోట, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి ద్వారా చిత్తూరు, కుప్పం, పుంగనూరు, రాయచోటి వరకు నీళ్లు అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు.

వైయస్సార్‌సీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు

తమ పాలనలో తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువల సామర్థ్యం పెంచామని చెప్పారు. అవుకు టన్నెల్స్‌, గండికోట, చిత్రావతి, బ్రహ్మంసాగర్‌, వెలిగొండ, సోమశిల, కండలేరు, పులిచింతల వంటి ప్రాజెక్టుల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీరు నింపామని వివరించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు – క్రెడిట్‌ చోరీ

భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి క్రెడిట్‌ కొట్టేయడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఆయన నిజానికి ఆ ఎయిర్‌పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూ దందాకి ప్లాన్‌ చేశారు. మొదట ఆ ఎయిర్‌పోర్టుకు 15 వేల ఎకరాలు కావాలన్నారు. ఆ తర్వాత 5 వేల ఎకరాలు అన్నాడు. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురై ఉద్యమ బాట పట్టారు. మేమూ వారితో గొంతు కలిపి, అధికారంలోకి వచ్చాక, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎయిర్‌పోర్టుతో పాటు, ఏరోసిటీ కూడా కలిపి 2,703 ఎకరాలతో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాం. అందుకోసం కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. 3 గ్రామాలో 400 కుటుంబాలను తరలించి, రూ.960 కోట్లతో భూసేకరణ జరిపాం. అవన్నీ చేసి, వేగంగా ఎయిర్‌పోర్టు పనులు కొనసాగించాం. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అదే పార్టీకి చెందిన అశోక గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా, కనీస అనుమతులు తేలేకపోయారు. కోవిడ్‌ వంటి కష్టంలో కూడా అన్నీ దాటుకుని, 2023, మే 3న, భూమి పూజ చేశాం. 2026లో అక్కణ్నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పాం. అంతే కాకుండా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేసి, అప్పటి ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కూడా ఒప్పించాం. నిజానికి ఇప్పుడు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వేగంగా చేరుకోవడానికి సరైన రోడ్డు కూడా లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం ఆ రోడ్డు గురించి అస్సలు పట్టించుకోలేదు. అయినా క్రెడిట్‌ మొత్తం తమకే దక్కాలని చంద్రబాబు ఏవేవో చేస్తున్నారు. ‘క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌’.. అదే చంద్రబాబు విధానం. తాను ఏమీ చేయడు. ఎవరో చేసిన పని తాను చేసినట్లు చెబుతాడు. తన ఖాతాలో వేసుకుంటాడు. క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు సిద్ధహస్తుడు.

పరిశ్రమల పురోగతి – ఆర్బీఐ నివేదిక

‘మా హయాంలో ఇక్కడి నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయని పదే పదే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ఎల్లో మీడియాలోనూ, సోషల్‌ మీడియా (అబద్దాల ఫ్యాక్టరీ)లోనూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ తప్పు అని చెబుతూ, గత నెల.. డిసెంబరు 11, 2025న ఆర్బీఐ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. ఉత్పత్తి రంగంలో గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ)కు పన్నులు కలిపితే, అది జీడీపీ అవుతుంది. మా హయాంలో తయారీ రంగంలో జీవీఏలో రాష్ట్రం దక్షిణ భారత్‌లో తొలిస్థానంలో నిలవగా, దేశంలో 5వ స్థానంలో నిల్చాం. అలాగే ఆ 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు.. ఇండస్ట్రియల్‌ జీవీఏ చూస్తే.. అందులో కూడా దక్షిణ భారత్‌లో తొలి స్థానంలోనూ, దేశంలోనే 5వ స్థానం సాధించాం. ఇవీ వాస్తవాలు. కానీ, చంద్రబాబు ఏమంటాడు. ఆయనకు ఒక పైశాచిక ఆనందం. మాపై టన్నుల కొద్దీ బురద చల్లుతుంటాడు.

నిజానికి చంద్రబాబుగారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. సజ్జన్‌ జిందాల్, అరవిందో, మై హోం సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్‌కో, షిర్డి సాయి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, యూబీ అయినా.. చంద్రబాబు వల్ల భయపడి, ఇబ్బందులు పడలేక తరలిపోయాయి. ఇంకా రాష్ట్రంలో ఏ పరిశ్రమ అయినా వీళ్లకు కప్పం కట్టకపోతే, అవి నడిపే పరిస్థితి లేదు. ఇది వాస్తవం.

చంద్రబాబు మరో డ్రామా

ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబు, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు. దీంతో డైవర్షన్‌ కోసం విచిత్రంగా పారిశ్రామిక ప్రతిపాదనల్లో రాష్ట్రం తొలి స్థానంలో ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అనుకూల మీడియాలో స్టోరీలు నడిపారు. అలా ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. 2014–19 మధ్య కూడా అదే పరిస్థితి.

పరిశ్రమల పేరుతో అవినీతి

పేరుకు ఒకటి, రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా భూమి ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూములను తన మనుషులు, తన బినామీలకు ఇచ్చేస్తాడు. విశాఖలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలూ కంపెనీకి ఇచ్చారు. ఎలాంటి టెండర్, ఆక్షన్‌ లేకుండా కేవలం, ఆ కంపెనీ లెటర్‌ రాయగానే, మాల్‌ కట్టేందుకు ఆ భూమి ఇచ్చేశారు. అదే లూలూ గ్రూప్‌ రూ.519 కోట్లకు 16 ఎకరాలు అహ్మదాబాద్‌లో కొనుక్కుని మాల్‌ కడుతుంటే.. ఇక్కడ 14 ఎకరాల భూమి ఫ్రీగా ఇచ్చారు. గుజరాత్‌లో లూలూ కంపెనీ భూమి కొనుగోలుతో స్టాంప్‌ డ్యూటీ కింద రూ.31 కోట్లు ఆదాయం వచ్చిందని ఆ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా సత్వా , కపిల్‌ , ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్రూప్‌లకు కూడా ఎలాంటి ఆక్షన్‌ లేకుండా ఫ్రీగా భూములిచ్చేస్తున్నారు. పక్కన తెలంగాణలో భూముల వేలంలో ఒక్కో ఎకరం దాదాపు రూ.175 కోట్లు పలుకుతుంటే.. ఇక్కడ ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమి కేవలం రూ.1.50 కోట్లకు ఇచ్చారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్‌ గ్రూప్‌నకు 10 ఎకరాలు ఇచ్చారు. అలా ఒకవైపున అలా భూములు ఇవ్వడమే కాకుండా, మరోవైపు ల్యాండ్‌ యూసేజ్‌లో వాళ్లు బిల్డింగ్‌లు కడితే, చదరపు అడుగుకు రూ.2 వేలు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందట. అంటే ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బిల్డింగ్‌లు కడితే, ప్రభుత్వం నిధులు ఇవ్వడం ఏమిటి? ఎంత అవినీతి!.

రాష్ట్ర అప్పులు – వాస్తవాలు

2019 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పులు రూ.3.90 లక్షల కోట్లు కాగా, వైయస్సార్‌సీపీ హయాంలో 2024 మార్చి నాటికి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. అయితే చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 22.63% కాగా, తమ హయాంలో అది 13.57% మాత్రమేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని తీవ్ర విమర్శలు చేశారు.

బాదుడే బాదుడు

18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో రూ.20,135.50 కోట్లు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 50 శాతం పెంచారు. గ్రామాల్లో తాగునీటిపైనా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

కొత్త వాహనాలపై 10 శాతం రోడ్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. (తగ్గించిన జీఎస్టీని, ఈ రూపంలో వసూలు చేస్తున్నారు). అన్ని రకాల రోడ్లకు టోల్‌ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, ఇప్పుడు మరో రూపంలో రోడ్‌ సెస్‌ పేరిట బాదుతున్నారు. మెడికల్‌ కాలేజీలకు టెండర్లు రాకపోవడం సంతోషకరం. మంచి విషయం. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7వ తేదీ) హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) కూడా వేశాం. దాన్ని కోర్టు కూడా ఆమోదించింది. ప్రభుత్వానికి సమన్లు పంపించింది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలో అతి పెద్ద స్కామ్‌ అని, దీనిపై హైకోర్టులో పిల్‌ దాఖలు చేశామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ కేవలం ఆ ప్రాంతానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కీలకమని జగన్‌ స్పష్టం చేశారు. దీనిపై కూడా ఉద్యమాలు చేస్తాం. మేము తిరిగి అధికారంలోకి రాగానే వాయువేగంతో ఈ లిఫ్ట్‌ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు.