
చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయం 10 గంటలు మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు పది గంటల పాటు మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుసరిస్తున్న ఆగమ శాస్త్ర, సంప్రదాయ నియమాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉదయం 9:00 గంటల నుంచే ఆలయాన్ని మూసివేసి, సాయంత్రం 7:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేసారు. ఈ సమయంలో స్వామివారి సర్వ దర్శనాలు, సేవలు పూర్తిగా నిలిపివేయడ౦ జరిగినది.
టిటిడీ పరిధిలో ఉన్న అన్ని అనుబంధ ఆలయాలు కూడా చంద్రగ్రహణ కాలంలో మూసివేయబడ్డాయని అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం శుద్ధి, పవిత్రీకరణ (పుణ్యాహవాచనం) కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే భక్తులకు తిరిగి దర్శనాలు ప్రారంభించారు.
చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని ఉచిత అన్నప్రసాదం పంపిణీ కేంద్రాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. లక్షలాది మంది భక్తులు రోజూ అన్నప్రసాదం స్వీకరించే నేపథ్యంలో, ఈ మార్పును గమనించి ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని టిటిడి భక్తులకు ముందుగానే సూచించింది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులు దర్శన సమయాల్లో జరిగిన మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భూమి యొక్క ఉంబ్రా (పూర్తి నీడ)లో చంద్రుడు పూర్తిగా ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని వివరించింది. చంద్రుడి కొంత భాగమే భూమి నీడలోకి వెళ్తే దానిని పాక్షిక చంద్రగ్రహణంగా పేర్కొంటారు.
ఐఎండీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టు ప్రకారం, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తీవ్రత (మ్యాగ్నిట్యూడ్) 1.155గా ఉంది. ఈ ఖగోళ ఘటన భారతదేశంతో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది.
భారతదేశంలో గ్రహణ దర్శనం ప్రాంతాలవారీగా భిన్నంగా ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో చంద్రోదయ సమయంలో గ్రహణం చివరి దశ మాత్రమే కనిపించింది. అయితే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్–నికోబార్ దీవుల్లో సంపూర్ణ దశ ముగింపు కూడా స్పష్టంగా కనిపించింది.
భారత ప్రామాణిక కాలం ప్రకారం, చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సంపూర్ణ దశ 4:34 గంటలకు మొదలై 5:33 గంటలకు ముగిసింది. మొత్తం గ్రహణ ప్రక్రియ సాయంత్రం 6:48 గంటలకు పూర్తయ్యిందని ఐఎండీ వెల్లడించింది.
కాగా ఈ చంద్రగ్రహణం కారణంగా దేశంలోని అన్ని దేవాలయాలు నిన్న ఉదయం మూసివేసి సాయంత్రం సంప్రోక్షణ తరువాత తెరిచారు.
