
చండీగఢ్‌లో బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు.. ఎన్‌ఐఏ దర్యాప్తు
బీజేపీ పంజాబ్ రాష్ట్ర కార్యాలయం బయట బుధవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన ప్రకారం, కార్యాలయం వద్దకు ఒక చిన్న క్రూడ్ పేలుడు పదార్థాన్ని విసిరినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో హెల్మెట్ ధరించిన వ్యక్తి గ్రెనేడ్‌లాంటి వస్తువును విసిరి, మరో వ్యక్తి దాన్ని వీడియో తీసినట్లు కనిపించింది. వస్తువు విసిరిన వెంటనే ఇద్దరూ పరుగెత్తుతూ వెళ్లిపోతారు. ఆ తర్వాత పేలుడు శబ్దం వినిపిస్తుంది. అయితే ఆ వీడియో నిజమో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.
చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్‌దీప్ కౌర్ మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది చిన్న క్రూడ్ పేలుడు పరికరాన్ని విసిరిన ఘటనగా కనిపిస్తోందని తెలిపారు. సంఘటనా స్థలానికి క్రైమ్ బ్రాంచ్, ఆపరేషన్ సెల్ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు కూడా అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
పార్టీ రాష్ట్ర మీడియా విభాగం అధిపతి వినీత్ జోషి మాట్లాడుతూ పేలుడు శబ్దం వినిపించగానే కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. పేలుడు కారణంగా ఒక స్కూటర్ దెబ్బతిందని, ఒక కారుకు చెందిన అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. గోడలపై పేలుడు గుర్తులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాకర్ ఈ ఘటనను పార్టీ కార్యాలయంపై దాడిగా అభివర్ణించారు. ఇటీవల పంజాబ్‌లో పోలీస్ స్టేషన్లపై గ్రెనేడ్ దాడులు, హోషియార్పూర్‌లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం జరిగిన ఘటనల తరువాత ఇప్పుడు బీజేపీ కార్యాలయంపై దాడి జరగడం రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ దర్యాప్తును వేగంగా పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అకాలీ దళ్ నేత బిక్రం సింగ్ మజిథియా కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భద్రతా వ్యవస్థపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు.
