Let's talk: editor@tmv.in
చండీగఢ్‌లో పెంపుడు కుక్కలను పెంచేవారికి కొత్త నిబంధనలు

చండీగఢ్‌లో పెంపుడు కుక్కలను పెంచేవారికి కొత్త నిబంధనలు

Pinjari Chand
31 అక్టోబర్, 2025

చండీగఢ్‌లో పరిపాలన విభాగం పెంపుడు కుక్కల యజమానులపై కొత్తగా కఠిన నియమాలు విధించింది. ‘పెట్‌, కమ్యూనిటీ డాగ్‌ బైలాస్’ పేరుతో నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. వీటిలో రిజిస్ట్రేషన్‌ నుంచి జరిమానాలు, నిషేధిత పెంపుడు జాతుల వరకు పలు మార్పులు చేసింది. ఈ నిమయాలు నేటినుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఇకపై ప్రతి పెంపుడు కుక్కను చండీగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాలి. ఒక్క కుక్కకు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రతి ఐదు సంవత్సరాలకు రూ.50 రెన్యూవల్‌ ఫీజు చెల్లించాలి. రిజిస్టర్‌ చేసిన కుక్కకు మెటల్‌ టోకెన్‌, కాలర్‌ తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ లేకపోతే కుక్కను స్వాధీనం చేసుకునే హక్కు కార్పొరేషన్‌కు ఉంటుంది.

భారీగా జరిమానాలు

నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై రూ.10,000 వరకు జరిమానా విధించనున్నారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా కుక్కను ఉంచడం, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం, చెత్త చేయడం వంటి చర్యలు ఇకనుంచి నేరంగా పరిగణించబడతాయి.

నిబంధనలు ఉల్లఘించి విధించిన జరిమానాలు చెల్లించకపోతే కుక్క సంబంధించిన లైసెన్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ను మునిసిపల్‌ కార్పొరేషన్‌ రద్దు చేస్తుంది. అంటే ఆ కుక్కను చట్టబద్ధంగా ఉంచే హక్కు యజమానికి ఉండదు. మునిసిపల్‌ అధికారులు ఆ కుక్కను స్వాధీనం చేసుకొని డాగ్ షెల్టర్ లేదా స్ట్రే అనిమల్ కేర్ సెంటర్కి తరలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుక్క కారణంగా ఎవరికైనా ప్రమాదం జరిగితే, పబ్లిక్ ప్రదేశాల్లో అవాంఛనీయ పరిస్థితి కలిగితే, నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నిర్ధారణ జరిగితే, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా మొదలవచ్చు. మునిసిపల్‌ యాక్ట్‌ ప్రకారం పెనాల్టీని ప్రాపర్టీ ట్యాక్స్‌ బిల్లులో జమ చేస్తారు.

ఇంటి పరిమాణాన్ని బట్టి కుక్కల సంఖ్య

• 5 మార్లాల(భూమి కొలమానం,125 చదరపు.మీ ) వరకు ఉన్న ఇళ్లలో – 1 కుక్కను మాత్రమే పెంచుకోవాలి.

• 5 నుంచి 12 మార్లాల మధ్య – 2 కుక్కలు

• 12 మార్లాలా నుంచి ఒక కనాల్‌ వరకు – 3 కుక్కలు

• ఒక కనాల్‌ కంటే ఎక్కువ ఇళ్లలో – గరిష్టంగా 4 కుక్కలు. బహుళ అంతస్తుల ఇళ్లలో ప్రతి కుటుంబం ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ జాతి కుక్కలను పెంచకూడదు

అమెరికన్‌ బుల్‌డాగ్‌, పిట్‌బుల్‌, పిట్‌బుల్‌ టెరియర్‌, బుల్‌ టెరియర్‌, కేన్‌ కార్సో, డోగో ఆర్జెంటినో, రాట్వైలర్‌ వంటి దూకుడుగా వ్యవహరించే జాతి కుక్కలను ఇకపై పెంచుకోకూడదు. అలాగే సుఖ్నా లేక్‌, రోజ్‌ గార్డెన్‌, శాంతి కుంజ్‌, లెజర్‌ వ్యాలీ, టెర్రస్‌ గార్డెన్‌, శివాలిక్‌ గార్డెన్‌, బోటానికల్‌ గార్డెన్ ‌వంటి పబ్లిక్‌ ప్రదేశాల్లో పెంపుడు కుక్కలను అనుమతించరని కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

వీధి కుక్కలపై కూడా దృష్టి

వీధి,కమ్యూనిటీ కుక్కల నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. నగరం పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొత్తం మీద చండీగఢ్‌లో ఇప్పుడు కుక్కల యజమానులపై కఠిన చర్యలు తప్పవు. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పేలా లేవు.