
ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహ ఐదుగురు మృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా దిగ్ర్బాంతికి గురైంది. మహారాష్ట్ర ప్రజలు ప్రేమగా ‘దాదా’ అని పిలుచుకునే నాయకుడు, పొలిటికల్ ‘పవర్’ సెంటర్ అని పిలుచుకునే రాజకీయ నాయకులు షాక్ కు గురయ్యారు.
మహారాష్ట్ర పుణే జిల్లా బారామతి విమానాశ్రయం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముంబై నుంచి బారామతికి బయలుదేరిన లియర్‌జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్‌తో పాటు కెప్టెన్ సుమిత్ కపూర్, సహ పైలట్ కెప్టెన్ శంభావి పాఠక్, వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాధవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మృతి చెందారు. అజిత్ పవార్ మరణం బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర కూటమి ప్రభుత్వంలోనే కాకుండా, ఆయన నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) భవిష్యత్తుపై కూడా అనిశ్చితిని కలిగించింది.
ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుణే జిల్లాలో నాలుగు బహిరంగ సభలను ఉద్దేశించి అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో కెప్టెన్ సుమిత్ కపూర్ (15,000 గంటల విమాన ప్రయాణ అనుభవం), సహ పైలట్ కెప్టెన్ శంభావి పాఠక్ (1,500 గంటల అనుభవం), అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాధవ్, విమాన సిబ్బంది సభ్యురాలు పింకీ మాలి ఉన్నారు.
ప్రమాదానికి దారి తీసిన పరిణామాలు
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. బుధవారం ఉదయం బారామతిలో తక్కువ దృశ్యమానత కారణంగా విమానం తొలుత ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించుకుని (గో–అరౌండ్) మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే చివరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి ల్యాండింగ్ అనుమతి లభించినప్పటికీ, పైలట్ నుంచి అవసరమైన ‘రీడ్‌బ్యాక్’ రాలేదని, ఆ తర్వాత క్షణాల్లోనే విమానం రన్‌వే అంచున కూలి మంటల్లో చిక్కుకుపోయిందని పేర్కొంది. విమానయానంలో ‘గో–అరౌండ్’ అనేది భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ ప్రక్రియ కాగా, ‘రీడ్‌బ్యాక్’ అనేది ఏటీసీ ఆదేశాలను పైలట్ స్పష్టంగా అర్థం చేసుకున్నాడని నిర్ధారించే కీలక భద్రతా విధానం.
దర్యాప్తు ప్రారంభం
ఈ ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తును చేపట్టిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి గురైన లియర్‌జెట్ విమానం వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా వెల్లడించింది. ఫ్లైట్ రాడార్ సమాచారం ప్రకారం, విమానం ఉదయం 8.10 గంటలకు ముంబై నుంచి బయలుదేరి, 8.45 గంటల ప్రాంతంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. క్షణాల వ్యవధిలోనే అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ, విమానం గాల్లో కొంత అస్థిరంగా కనిపించిందని, నేలను తాకిన వెంటనే భారీ పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సంతాపం
అజిత్ పవార్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, అఖిలేశ్, స్టాలిన్ పలువురు కేంద్ర–రాష్ట్ర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బారామతికి చేరుకుని ఇది నమ్మశక్యం కాని విషాదం. నేను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను అని అన్నారు.
మూడు రోజుల రాష్ట్ర సంతాపం
అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 వరకు మూడు రోజుల రాష్ట్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ కాలంలో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను ఉంచనున్నారు.
నేడు అంత్యక్రియలు
అజిత్ పవార్‌కు భార్య సునేత్ర పవార్ (రాజ్యసభ సభ్యురాలు), ఇద్దరు కుమారులు పార్థ్, జయ్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం బారామతిలో పూర్తి రాష్ట్ర గౌరవాలతో నిర్వహించనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధాని మోడీ, అమిత్ షా అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ బారామతి విమానాశ్రయం, అలాగే మృతదేహాన్ని తరలించిన వైద్య కళాశాలను సందర్శించారు. బారామతి లోక్‌సభ సభ్యురాలు సుప్రియ సూలే తన మేనమామ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం చివరి క్షణాలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమానం బారామతీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి పొందిన కొద్దిక్షణాలకే రన్‌వే అంచున మంటల్లో చిక్కుకుని కూలిపోయిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. తక్కువ దృశ్యమానత కారణంగా తొలుత ల్యాండింగ్ విఫలమవడంతో ‘గో–అరౌండ్’ చేపట్టిన విమానం, చివరకు ల్యాండింగ్ క్లియరెన్స్ అందుకున్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు ఎలాంటి ధృవీకరణ (రీడ్‌బ్యాక్) ఇవ్వకుండానే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన లియర్‌జెట్–45 విమానం బుధవారం ఉదయం ఈ దుర్ఘటనకు గురైంది.
ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలు
బారామతీ విమానాశ్రయం ఒక ‘అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్’గా గుర్తింపు పొందింది. అంటే, తక్కువ దృశ్యమానత పరిస్థితుల్లో విమానాలకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) ఇక్కడ లేదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడి ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థల పైలట్లు, ఇన్‌స్ట్రక్టర్లే ట్రాఫిక్ సమాచారాన్ని అందిస్తుంటారు. ప్రమాదానికి గురైన విమానం ఉదయం 8.18 గంటలకు బారామతీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను తొలిసారి సంప్రదించింది. అనంతరం 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మరోసారి సంప్రదింపులు జరిగాయి. అప్పట్లో పైలట్ ఇష్ట ప్రకారం ‘విజువల్ మెటీరియోలాజికల్ కండిషన్స్’లో దిగవచ్చని ఏటీసీ సూచించింది. వాతావరణ పరిస్థితులపై పైలట్లు ఆరా తీయగా, గాలులు ప్రశాంతంగా ఉన్నాయని, దృశ్యమానత సుమారు 3,000 మీటర్లు ఉందని ఏటీసీ తెలిపింది.
తొలి ల్యాండింగ్ ప్రయత్నం విఫలం
రన్‌వే–11పై తుది దశలోకి విమానం చేరుకున్నప్పుడు ‘రన్‌వే కనిపించడం లేదు’ అని సిబ్బంది ఏటీసీకి తెలియజేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా గో–అరౌండ్ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించి మళ్లీ ఎగరడం) చేపట్టారు. గో–అరౌండ్ అనంతరం మళ్లీ రన్‌వే కనిపిస్తోందా అని ఏటీసీ అడగగా, ప్రస్తుతం రన్‌వే కనిపించడం లేదు… కనిపించిన తర్వాత తెలియజేస్తామని పైలట్లు స్పందించారు. కొద్ది క్షణాల తర్వాత ‘రన్‌వే కనిపిస్తోంది’ అని సిబ్బంది సమాచారం ఇచ్చారు.
ల్యాండింగ్ అనుమతి… క్షణాల్లో ప్రమాదం
దీంతో ఉదయం 8.43 గంటలకు రన్‌వే–11పై ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇచ్చింది. అయితే, ఆ అనుమతిని పైలట్లు తిరిగి ధృవీకరించే ‘రీడ్‌బ్యాక్’ ఇవ్వలేదని పౌర విమానయాన శాఖ తెలిపింది. అనుమతి ఇచ్చిన ఒక్క నిమిషంలోనే (8.44 గంటలకు) రన్‌వే అంచున భారీ మంటలు ఎగసిపడుతున్నట్లు ఏటీసీ గమనించింది. వెంటనే అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే అందరూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
గో–అరౌండ్, రీడ్‌బ్యాక్ అంటే ఏమిటి?
గో–అరౌండ్: వాతావరణం, రన్‌వే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్‌ను విరమించి మళ్లీ ఎగరడం.
రీడ్‌బ్యాక్:ఏటీసీ ఇచ్చిన కీలక ఆదేశాలను పైలట్ తిరిగి చదివి వినిపించడం. ఇది ఆదేశాలు సరిగ్గా అర్థమయ్యాయో లేదో నిర్ధారించే కీలక భద్రతా ప్రక్రియ.
దర్యాప్తు వివరాలు
ఈ ప్రమాదంపై దర్యాప్తును విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ ) స్వాధీనం చేసుకుంది. డీజీ–ఏఏఐబీ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టనున్నారు. ప్రమాదానికి గురైన విమానం నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ (ఎన్ఎస్ఓపీ) కేటగిరీకి చెందినది. 2010లో తయారైన ఈ విమానానికి సంబంధించిన ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్, ఆడిట్లు అన్నీ చెల్లుబాటు అయ్యేవేనని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2025లో డీజీసీఏ నిర్వహించిన చివరి నియంత్రణ ఆడిట్‌లో ఎలాంటి తీవ్రమైన లోపాలు గుర్తించలేదని వెల్లడించారు.
మహారాష్ట్ర, దేశ అభివృద్ధికి అజిత్ దాదా గొప్ప సేవలు: ప్రధాని మోడీ
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో పాటు దేశ అభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అజిత్ పవార్ విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ క్యాడెట్ కార్ప్స్ (NCC) ర్యాలీలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం పుణె జిల్లాలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరికొందరు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ‘అజిత్ దాదా’ మహారాష్ట్ర, దేశ అభివృద్ధికి గొప్ప సేవలు అందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఆయన పాత్ర అనన్యసాధారణం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేమంతా అండగా ఉంటామని ప్రధాని అన్నారు.
రాజకీయ రంగు వద్దు: శరద్ పవార్
ఈ ప్రమాదంపై స్పందించిన ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఇది పూర్తిగా ప్రమాదమేనని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదంతో వెంటాడిన అహ్మదాబాద్ విమాన దుర్ఘటన జ్ఞాపకాలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన బారామతి విమాన ప్రమాదం, గుజరాత్‌లోని షాహీబాగ్, మెఘానీనగర్ ప్రాంత వాసుల్లో గతేడాది జరిగిన అహ్మదాబాద్ విమాన దుర్ఘటనకు సంబంధించిన భయానక జ్ఞాపకాలను మళ్లీ తలపెట్టింది. గత ఏడాది జూన్ 12న, సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 (బోయింగ్ 787-8) టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ సముదాయంపై కూలిపోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది, అలాగే నేలపై ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది భారతదేశ విమానయాన చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనలలో ఒకటిగా నిలిచింది.
‘ఆ దృశ్యాలు మళ్లీ కళ్లముందు నిలిచాయి’
అహ్మదాబాద్ ప్రమాద స్థలానికి కేవలం 500 మీటర్ల దూరంలో నివసించే వ్యాపారవేత్త రాజేశ్ పటేల్, బారామతి ప్రమాద వార్త విన్న వెంటనే గత జ్ఞాపకాలు తలపోశాయని తెలిపారు. ఈ రోజు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదం వార్త విన్నప్పటి నుంచి, ఆ రోజు దృశ్యాలు మళ్లీ నా కళ్లముందు తిరుగుతున్నాయి. ఆ వేసవి మధ్యాహ్నం మళ్లీ గుర్తొస్తోందని ఆయన అన్నారు. తన ఇంటి నుంచి దట్టమైన నల్ల పొగలు, ఎగసిపడుతున్న మంటలు కనిపించాయని తెలిపారు. మొదట పేలుడు జరిగిందేమో అనుకున్నానని, కానీ విమానం కూలిపోయిందని ఉద్యోగి ద్వారా తెలిసిందని చెప్పారు. అలాగే గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దోర్జిఖండ్, జీఎంసీ బాలయోగి, హీరోయిన్ సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే.
పైలట్ల అభిప్రాయం
బారామతి ప్రమాదం విమానయాన రంగానికి తీవ్ర దుఃఖకరమైన ఘటనగా గాంధీనగర్‌కు చెందిన ఓ వీఐపీ పైలట్ పేర్కొన్నారు. మృతిచెందిన పైలట్లలో ఒకరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఇలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే అని అన్నారు. మరో పైలట్ మాట్లాడుతూ, శీతాకాలంలో దృశ్యమానత తగ్గడం సాధారణమని, బారామతి విమానాశ్రయం ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ లేని ఎయిర్‌స్ట్రిప్ కావడంతో పైలట్ నిర్ణయంపైనే ల్యాండింగ్ ఆధారపడి ఉంటుందని తెలిపారు.
‘ దాదా’ మరణంతో పెద్ద దిక్కు కోల్పోయిన బీడ్ జిల్లా
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో బీడ్ జిల్లా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జిల్లా గార్డియన్ మంత్రిగా ఆయన చేపట్టిన అభివృద్ధి చర్యలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.కేవలం రెండు రోజుల క్రితమే బీడ్ జిల్లాలో 24 అభివృద్ధి పనుల కోసం రూ.22 కోట్ల నిధులను మంజూరు చేసిన అజిత్ పవార్‌కు అదే చివరి అభివృద్ధి బహుమతిగా మారింది. టీవీ చానళ్లలో ఆయన మృతి వార్త వెలువడిన వెంటనే బీడ్ జిల్లావ్యాప్తంగా స్వచ్ఛంద బంద్ పాటించారు. దుకాణాలు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. పుణే జిల్లా బారామతి సమీపంలోని విమానాశ్రయం వద్ద విమానం కూలిపోవడంతో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బీడ్ గార్డియన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాకు అభివృద్ధి నిధుల ప్రవాహం ఆగకుండా చూసిన నేతగా అజిత్ పవార్ గుర్తింపు పొందారు. జిల్లా ప్రణాళిక కమిటీ ద్వారా రూ.575 కోట్ల నిధులను కేటాయించి, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు.
అహిల్యానగర్–పర్లీ రైల్వే లైన్, బీడ్ విమానాశ్రయం ఏర్పాటు కోసం సర్వే వంటి కీలక ప్రాజెక్టులు ఆయన కృషికి నిదర్శనాలుగా నిలిచాయి. కమ్కేఢా ప్రాంతంలో విమానాశ్రయానికి సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించడం కూడా ఆయన చొరవలో భాగమే. వేగం, క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడాన్ని స్థానిక నేతలు ‘దాదా ప్యాటర్న్ ఆఫ్ డెవలప్‌మెంట్’గా అభివర్ణిస్తున్నారు. ఆయన మరణంతో బీడ్ జిల్లా ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే కాకుండా, అభివృద్ధి శిల్పిని కోల్పోయిందని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు, రైతులు, సామాన్య ప్రజలు జిల్లావ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. 2025 జనవరి 19న గార్డియన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్, అప్పటి మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిలోకి వచ్చారు.
అజిత్ పవార్ పీఎస్‌వో జాధవ్ మృతి… ఆప్యాయ స్వభావాన్ని గుర్తు చేసుకుంటున్న పొరుగువారు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కూలిపోవడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) విదీప్ జాధవ్ కూడా ఉన్నారు. ఈ వార్త వెలువడగానే థానే జిల్లా కల్వా ప్రాంతంలోని విటావా కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం 8.50 గంటలకు అజిత్ పవార్‌ను తీసుకెళ్తున్న విమానం కూలిపోగా, అందులో ఉన్న ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. విటావా ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న విదీప్ జాధవ్‌కు తల్లిదండ్రులు, 14 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లి ఉండగా, వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బారామతికి చేరుకున్నారు. కృష్ణ విహార్‌కు వెళ్లే దారిలో ఉన్న జాధవ్ నివాసం వద్ద పొరుగువారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు అని చెబుతున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆయన విధుల కోసం బయలుదేరడాన్ని చూశాను. కేవలం రెండు గంటల్లోనే ఆయన లేరన్న వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ఓ పొరుగువాడు వాపోయాడు. మరో నివాసితుడు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఆయనను తెలుసు. ఉదయం విధులకు వెళ్తూ తన అలవాటు ప్రకారమే నవ్వుతూ చేయి ఊపాడు. అదే చివరిసారి చూస్తున్నామనే విషయం ఎవరికీ ఊహకే రాలేదని కన్నీటితో చెప్పారు.
‘బారామతికి వెళ్తున్నాను… రేపు మాట్లాడతా’: పవార్ విమానంలో మృతి చెందిన అటెండెంట్ తండ్రి ఆవేదన
కన్నీళ్లతో నిండిన కళ్లతో, గొంతు బరువెక్కిన స్వరంతో శివకుమార్ మాలి మాట్లాడుతూ… రేపు మాట్లాడతానని చెప్పింది. కానీ ఆ రేపు ఇక ఎప్పటికీ రాదని వేదన వ్యక్తం చేశారు. బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా ఉన్నారు. ఆమె శివకుమార్ మాలి కుమార్తె.
నాన్నా… రేపు (బుధవారం) అజిత్ పవార్‌తో కలిసి బారామతికి వెళ్తున్నాను. అక్కడ ఆయనను దింపిన తర్వాత నాందేడ్‌కు వెళ్తాను. హోటల్‌కు చేరిన తర్వాత నీతో మాట్లాడతాను అని పింకీ తనకు చివరిసారిగా చెప్పిందని శివకుమార్ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తున్న లియర్‌జెట్–46 విమానంలో పింకీ అటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా, ఆ విమానం బారామతి విమానాశ్రయంలో కుప్పకూలింది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారని డీజీసీఏ తెలిపింది. పింకీ గతంలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖ రాజకీయ నేతలతో ప్రయాణించిందని ఆమె తండ్రి చెప్పారు. అజిత్ పవార్‌తో ఇది ఆమె నాలుగో ప్రయాణమని కూడా ఆయన తెలిపారు.
నిన్న సాయంత్రం ఆమెతో చివరిసారిగా మాట్లాడాను. రేపు మాట్లాడుకుందామని నేను చెప్పాను. కానీ ఆ మాట ఇక నెరవేరదు అంటూ శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్‌సీపీ కార్యకర్తగా ఉన్న శివకుమార్ మాలి, స్థానిక నాయకుడు సమాధాన్ సర్వంకర్ ద్వారా అజిత్ పవార్ విమాన ప్రమాదం గురించి సమాచారం అందిందన్నారు. టీవీ ఆన్ చేయగానే వార్త చూసి షాక్‌కు గురయ్యాను అని చెప్పారు.
తండ్రి–కుమార్తె చివరిసారిగా జనవరి 16న కలుసుకున్నారని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి పింకీ థానే నుంచి ప్రభాదేవికి వచ్చిందన్నారు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని చెప్పారు. గత ఐదేళ్లుగా పింకీ ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. తొలుత ఎయిర్ ఇండియాలో సేవలందించి, తర్వాత ప్రైవేట్ చార్టర్ విమాన సేవల రంగానికి మారిందని ఆమె తండ్రి వివరించారు. ఇటీవల అజిత్ పవార్‌తో జరిగిన ఒక ప్రయాణంలో ‘మీరు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు కానీ ఎన్‌సీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు’ అని పింకీ సరదాగా వ్యాఖ్యానించిందని శివకుమార్ తెలిపారు. అందుకు కారణం అడిగిన పవార్‌కు, మా నాన్న 35 ఏళ్లుగా ఎన్‌సీపీ కార్యకర్త అని ఆమె చెప్పిందన్నారు.
ఆ సంఘటన తర్వాత ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే తాను డ్రైవింగ్‌లో ఉండటంతో కాల్ తీసుకోలేకపోయానన్నారు. అనంతరం పవార్ మాట్లాడాలని మెసేజ్ కూడా వచ్చిందని చెప్పారు. ఆ కాల్ కూడా ఇక ఎప్పటికీ రాదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద వార్త విన్న వెంటనే శివకుమార్ మాలి కుటుంబ సభ్యులతో కలిసి బారామతికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, పింకీ మాలితో పాటు విదిప్ జాధవ్, కెప్టెన్ శంభావి పాఠక్, కెప్టెన్ సుమిత్ కపూర్ మృతి చెందారు.
విదిప్ జాధవ్ ముంబై పోలీసుల ప్రత్యేక రక్షణ విభాగానికి చెందిన పోలీస్ నాయక్. ఆయన థానే సమీపంలోని విటావా నివాసి. భార్య, కుమారుడు, తల్లి ఆయన కుటుంబ సభ్యులు. సమాచారం అందిన వెంటనే వారు కూడా బారామతికి చేరుకున్నారు.
లియర్‌జెట్–46 సహ పైలట్‌గా పనిచేసిన కెప్టెన్ శంభావి పాఠక్ గత మూడు సంవత్సరాలుగా వీఎస్‌ఆర్ వెంచర్స్‌లో పనిచేస్తున్నారని ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ తెలిపింది. 2018–19లో న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో వాణిజ్య పైలట్ శిక్షణ పొందిన ఆమె, 2020–22 మధ్య ముంబై యూనివర్సిటీలో ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నట్టు సమాచారం.
అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది వేగవంతమైన నిర్ణయాలు, రాజీ లేని వైఖరి, అధికార కేంద్రాలపై గట్టి పట్టు. మామ శరద్ పవార్ రాజకీయ వారసత్వంలోకి వచ్చినప్పటికీ, అజిత్ పవార్ తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకున్న నేత.
రాజకీయ ప్రవేశం
1991లో బారామతి ప్రాంతంలోని మాలేగావ్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. అదే ఎన్నికల్లో గెలిచి ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ విజయం నుంచే అజిత్ పవార్‌కు గ్రాస్‌రూట్ లెవెల్ లో రాజకీయంగా పట్టు పెరిగింది. గ్రామీణ సహకార వ్యవస్థలో (షుగర్ ఫ్యాక్టరీలు, బ్యాంకులు) ఆధిపత్యం సంపాదించడం ఆయన రాజకీయ ఎదుగుదలకు బలమైన పునాది అయింది. 1991లో నే తొలిసారిగా బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచే ఆయనను “యువ నాయకుడు, వారియర్ గా పార్టీ గుర్తించింది. అప్పటి నుంచి ఆయన బారామతి నుంచే సుమారు ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
మంత్రి పదవులు – పరిపాలనపై పట్టు
ఎన్‌సీపీ ప్రభుత్వాల్లో అజిత్ పవార్ కీలక శాఖలను నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ , జలవనరుల శాఖ ఆయన రాజకీయ జీవితంలో ప్రధానంగా నిలిచాయి. బడ్జెట్ రూపకల్పనలో ఆయన శైలి స్పష్టమైనది, కఠినమైనది అనే పేరు వచ్చింది. ఇదే సమయంలో ‘పాలనలో దాదా’ అన్న ముద్ర పడింది.
డిప్యూటీ సీఎం
అజిత్ పవార్ అనేకసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్–ఎన్‌సీపీ ప్రభుత్వంలో, తరువాత మహావికాస్ అఘాడీ (శివసేన–ఎన్‌సీపీ–కాంగ్రెస్) ప్రభుత్వంలో, 2023లో బీజేపీ–షిండే శివసేన ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వేర్వేరు రాజకీయ కూటముల్లోనూ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. అజిత్ పవార్ రాజకీయ జీవితం వివాదాలకు అతీతం కాదు. 2019లో ఓ ఉదయం బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో మాత్రం ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించి, ఎన్‌సీపీని చీల్చి అధికార పక్షంలో చేరారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనను పక్కన పెట్టి రాజకీయ లెక్కలు వేయలేని స్థితి ఏర్పడింది.
పవార్ కుటుంబ రాజకీయాల్లో పెను మలుపు ఎన్‌సీపీ చీలిక–2023
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో 2023 సంవత్సరం ఒక కీలక మలుపు. శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఆ సంవత్సరంలో రెండు ముక్కలైంది. ఇది కేవలం పార్టీ చీలిక మాత్రమే కాదు… పవార్ కుటుంబ రాజకీయాల్లో తరతరాల ఆధిపత్యానికి వచ్చిన అతిపెద్ద సవాల్. 2023 జూలైలో అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా శివసేన (షిండే)–బీజేపీ ప్రభుత్వంలో చేరారు. ఫడ్నవీస్ ప్రభుత్వంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేసింది. పార్టీ సిద్ధాంతాలకంటే అధికారమే ముఖ్యం అన్న సందేశం ఈ పరిణామంతో స్పష్టమైంది.
మామ–మేనల్లుడు రాజకీయ పోరు
ఈ చీలికతో శరద్ పవార్–అజిత్ పవార్ మధ్య దశాబ్దాలుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకవైపు సిద్ధాంతాలు, ప్రతిపక్ష రాజకీయాలు అంటున్న శరద్ పవార్… మరోవైపు “అధికారంలో ఉంటేనే అభివృద్ధి” అనే వాదనతో అజిత్ పవార్. ఈ పోరులో పార్టీ రెండుగా చీలింది. దీంతో 2024లో ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అజిత్ పవార్ వర్గాన్నే ‘నిజమైన ఎన్‌సీపీ’గా గుర్తించి, పార్టీ పేరు, గడియారం గుర్తును వారికి కేటాయించింది. శరద్ పవార్ వర్గం కొత్త పేరు, కొత్త గుర్తుతో రాజకీయ పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్‌సీపీ చీలికతో మహారాష్ట్రలో అధికార సమీకరణాలు పూర్తిగా మారాయి. బీజేపీకి ఇది వ్యూహాత్మక విజయంగా మారగా, ప్రతిపక్షానికి భారీ ఎదురుదెబ్బగా నిలిచింది.
అజిత్ పవార్ మృతి తర్వాత ఎన్‌సీపీ భవితవ్యంపై అనిశ్చితి: రాజకీయ విశ్లేషకులు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందడంతో, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలోనే కాకుండా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) భవిష్యత్తుపై కూడా తీవ్రమైన అనిశ్చితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజిత్ పవార్ మరణంతో ఎన్‌సీపీలో నేతృత్వ లోటు ఏర్పడిందని, ఆయనకు సమానమైన రెండో స్థాయి నాయకుడు పార్టీ వద్ద ప్రస్తుతం లేడని పరిశీలకులు చెబుతున్నారు. ‘గడియారం’ ఎన్నికల గుర్తుకు స్పష్టమైన నాయకుడిని కోల్పోవడంతో, పార్టీ మనుగడ, భవిష్యత్ దిశపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో, పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్తో ఉన్న సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశం కీలకంగా మారింది. శరద్ పవార్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగియనుండటంతో, రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల నెలల్లో రెండు వర్గాల మధ్య సంబంధాలు కొంత మెరుగుపడటంతో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్పీ)తో అజిత్ పవార్ వర్గం విలీనమయ్యే అవకాశాలపై ఇప్పటికే ఊహాగానాలు సాగాయి. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు, అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ వైపు మళ్లకుండా చూడటం పెద్ద సవాలుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఆమెకు పాలనా అనుభవం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌సీపీలో ఒక లోక్‌సభ సభ్యుడు (సునీల్ తట్కరే), ఇద్దరు రాజ్యసభ సభ్యులు (ప్రఫుల్ పటేల్, సునేత్ర పవార్) ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శరద్ పవార్ ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉండగా, ఆయన కుమార్తె, ఎన్‌సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన అజిత్ పవార్‌తో ఆమె పోటీ పడలేకపోయారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ (ఎస్పీ) విలీనం జరగవచ్చన్న చర్చలు జోరుగా సాగాయి. కానీ విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో, ఆ వర్గం భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది.
ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ఉన్నప్పటికీ, అజిత్ పవార్‌కు సమానమైన రాష్ట్రవ్యాప్త ప్రజా మద్దతు ఉన్న నాయకుడు పార్టీలో లేడని విశ్లేషకులు చెబుతున్నారు. మరో కీలక నేత ఛగన్ భుజ్‌బల్ ఇటీవలి మనీలాండరింగ్ కేసులో విముక్తి పొందినా, ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అధికార మహాయుతి కూటమిలో, బీజేపీకి 132 మంది ఎమ్మెల్యేలు, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రకాశ్ అకోల్కర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 5న జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో రెండు ఎన్‌సీపీ వర్గాలు కలిసి ‘గడియారం’ గుర్తుపై పోటీ చేస్తున్నాయని, ఇది అధికారికంగా కాకపోయినా, పరోక్ష విలీనానికి సంకేతం అని తెలిపారు. ఇప్పుడు ఎవరు ఎవరితో విలీనం అవుతారు అన్నదానికంటే, కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మినహా మిగిలిన ప్రతిపక్షాలు ఎలా పునరుజ్జీవించుకుంటాయన్నదే అసలు ప్రశ్న అని ఆయన అన్నారు.
ఇటీవల ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మహాయుతి నుంచి విడిగా పోటీ చేసిన ఎన్‌సీపీ 29 కార్పొరేషన్లలో 167 సీట్లు గెలుచుకుంది. అయితే పుణే, పింప్రి-చించ్వాడ్‌లలో బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. ఈ ప్రాంతాల్లో శరద్ పవార్ వర్గం కేవలం 36 సీట్లు మాత్రమే సాధించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 119 సీట్లు గెలుచుకోగా, ఎన్‌సీపీకి 27, ఎన్‌సీపీ (ఎస్పీ)కు కేవలం 3 సీట్లు మాత్రమే లభించాయి. పింప్రి-చించ్వాడ్‌లో బీజేపీ 84 సీట్లు సాధించగా, అజిత్ పవార్ వర్గం 37 సీట్లు గెలిచింది, శరద్ పవార్ వర్గానికి ఒక్క సీటు కూడా దక్కలేదు. గత నెలలో జరిగిన 246 మున్సిపల్ కౌన్సిళ్లు, 42 నగర్ పంచాయతీల ఎన్నికల్లో మొత్తం 6,851 సీట్లకు గాను ఎన్‌సీపీ 966, ఎన్‌సీపీ (ఎస్పీ) 256 సీట్లు సాధించాయి.
