
‘ఘూస్ఖోర్ పండత్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
‘ఘూస్ఖోర్ పండత్’ అనే సినిమా టైటిల్ పై సుప్రీం కోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి టైటిల్ ద్వారా సమాజంలోని ఒక వర్గాన్ని అవమానించరాదని చిత్ర దర్శకుడు నీరజ్ పాండేకు స్పష్టం చేసింది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇలాంటి టైటిల్ తో ఒక వర్గాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వారిని ఎందుకు అవమానించాలి? ఇది నైతికత, ప్రజా శాంతికి విరుద్ధం. టైటిల్ మార్చినట్లు తెలియజేయకపోతే చిత్ర విడుదలకు అనుమతించమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిత్రం ఏ వర్గాన్నీ అవమానించదని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు నీరజ్ పాండేకు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌ను బ్రాహ్మణ సమాజ్ ఆఫ్ ఇండియా జాతీయ సంస్థాగత కార్యదర్శి అతుల్ మిశ్రా దాఖలు చేశారు. సినిమా టైటిల్, కథనం కుల, మత ఆధారిత అపోహలను ప్రోత్సహిస్తూ సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు. ‘
‘ఘూస్ఖోర్ పండత్’ చిత్రంపై సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ అతుల్ మిశ్రా తరఫు న్యాయవాది వినోద్ తివారి కోర్టు అభ్యంతరాలపై స్పందించారు. ‘ఘూస్ఖోర్ పండత్’ అనే పదం వాడటం వల్ల పండితులు లంచాలు తీసుకునే వారు, దొంగలు అన్న భావన కలుగుతుంది. ఇది సమాజంలో ఒక వర్గాన్ని తప్పుగా చిత్రీకరిస్తుంది. కానీ దేవాలయాల్లో పూజలు నిర్వహించే పండితులు ‘దక్షిణ’ను భక్తుల విశ్వాసంతో స్వీకరిస్తారు. అది స్వచ్ఛంద సమర్పణ, లంచం కాదని ఆయన అన్నారు. టైటిల్ సమాజంలోని ఒక వర్గాన్ని అపహాస్యం చేసేలా ఉందనే కారణంతో సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చిత్రం ఏ వర్గాన్నీ అవమానించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
పండత్’ అనే కుల/మత గుర్తింపును సూచించే పదాన్ని ‘ఘూస్ఖోర్’ (లంచగొండి) అనే పదంతో కలిపి ఉపయోగించడం బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేదిగా ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. నీరజ్ పాండే నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయితో పాటు నుశ్రత్ భరూచా, సాకిబ్ సలీం, అక్షయ్ ఒబెరాయ్, దివ్యా దత్త తదితరులు నటిస్తున్నారు.
గతంలోనూ..
కొన్ని సినిమా టైటిళ్లు లేదా కంటెంట్‌పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేరుగా టైటిల్ మార్చాలని ఆదేశించిన ఘటనలు అరుదుగా మాత్రమే ఉన్నాయి. వాటిలో కొన్ని
‘పద్మావత్’ (మొదట ‘పద్మావతి’) కేసు
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావతి’ చిత్రంపై రాజ్‌పుత్ సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది. టైటిల్ చారిత్రక వ్యక్తిత్వాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్వచ్ఛందంగా సినిమా పేరు ‘పద్మావత్’గా మార్చారు. సినిమా విడుదలను కొన్ని రాష్ట్రాలు నిషేధించగా, సుప్రీం కోర్టు 2018లో ఆ నిషేధాన్ని రద్దు చేస్తూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు ఆపలేవని స్పష్టం చేసింది. టైటిల్ విషయంలో కోర్టు ప్రత్యక్ష ఆదేశం ఇవ్వకపోయినా, వివాదం నేపథ్యంలో పేరు మారింది.
‘ఆర్టికల్ 15’ కేసు
2019లో విడుదలైన ‘ఆర్టికల్ 15’ చిత్రంపై కొన్ని వర్గాలు కుల ఆధారంగా తీశారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేయకుండా, అభ్యంతరాలపై తగిన న్యాయపరమైన మార్గాలు ఉన్నాయని సూచించింది. టైటిల్‌పై నేరుగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
‘తాండవ్’ వెబ్ సిరీస్ కేసు
అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో మత భావాలను దెబ్బతీసే సన్నివేశాలున్నాయని ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సుప్రీం కోర్టు నిర్మాతలకు అరెస్టు నుండి తాత్కాలిక రక్షణ ఇచ్చింది. కంటెంట్‌పై వివాదం ఉన్నప్పటికీ, టైటిల్ మార్చాలని కోర్టు ఆదేశించలేదు.
