
ఘన వ్యర్థాల నిర్వహణపై సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్– ఎస్ డబ్య్లూఎం రూల్స్) అమలులో అసమానతలు ఉన్నాయని దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గుర్తించింది. అమలులో లోపాలు కొనసాగుతున్న ఈ సమయంలో మరింత చట్టపరమైన సవరణల కోసం ఎదురుచూడలేమని స్పష్టం చేసింది. జీవించే హక్కులో శుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం ఉండే హక్కు విడదీయరాని భాగమని పేర్కొంటూ, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఎస్ డబ్య్లూఎం నియమాలు–2026 అమలు కోసం దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన పలు మార్గదర్శకాలను శనివారం జారీ చేసింది.
క్షేత్ర స్థాయి నుంచే చెత్త వర్గీకరణ తప్పనిసరి
న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టితో కూడిన బెంచ్ ఫిబ్రవరి 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల (ఎంఎస్ డబ్ల్యూ) నిర్వహణకు సంబంధించిన నియమాల అమలు దేశవ్యాప్తంగా సమానంగా లేదు. క్షేత్ర స్థాయిలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాల వర్గీకరణ తప్పనిసరి అయినప్పటికీ అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇది పూర్తిగా అమలుకావడం లేదని వ్యాఖ్యానించింది. మెట్రో నగరాల్లో భారీ చెత్త కుప్పలు ఇంకా కొనసాగుతున్నాయని, బయో-రిమీడియేషన్ చర్యలు ప్రారంభమైనప్పటికీ ఫలితాలు పరిమితంగానే ఉన్నాయని కోర్టు పేర్కొంది.
ఈ ఉత్తర్వులు, భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన రెండు వేర్వేరు ఆదేశాలకు సంబంధించిన అప్పీళ్ల విచారణ సందర్భంగా వెలువడ్డాయి. క్షేత్రస్థాయిలో వర్గీకరణ, మౌలిక వసతులు లేకుండా మంచి ఫలితాలు ఆశించడం అసాధ్యం. వ్యర్థరహిత భారత్ సాధన ప్రతి వర్గం బాధ్యతని బెంచ్ స్పష్టం చేసింది.
ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యత
వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, మేయర్లు క్షేత్ర స్థాయి వ్యర్థాల వర్గీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రధాన బాధ్యతదారులుగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి పౌరుడిని 2026 నియమాల అమలులో భాగస్వామ్యం చేయించడం వారి కర్తవ్యమని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ మౌలిక వసతులపై ఆడిట్‌లు నిర్వహించాలి. గుర్తించిన లోపాలను, తీసుకున్న చర్యలను చీఫ్ సెక్రటరీలకు నిర్దిష్ట గడువులో తెలియజేయాలని కోర్టు తెలిపింది. ప్రతి స్థానిక సంస్థ 100 శాతం అమలుకు గడువు నిర్ధారించి ప్రకటించాలి. అమలు పురోగతిని నిర్ధారించేందుకు ఫోటో ఆధారాలతో కూడిన నివేదికలను జిల్లా కలెక్టర్లకు ఈమెయిల్ ద్వారా పంపాలని ఆదేశించింది.
కాలుష్య నియంత్రణ బోర్డులకు సూచనలు
తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాల నాలుగు విధాల వర్గీకరణకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి త్వరితగతిన ప్రారంభించేందుకు కాలుష్య నియంత్రణ మండళ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 నాటికి అన్ని భారీ వ్యర్థ ఉత్పత్తిదారులు పూర్తి స్థాయిలో చట్టపరమైన నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
పాఠశాలల్లోనూ వ్యర్థాల నిర్వహణ పాఠాలు
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖల రూల్ 33 ప్రకారం పాఠశాల పాఠ్యాంశాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ అంశాలను చేర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఎస్ డబ్య్లూఎం నియమాలు–2026 సారాంశాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం స్థానిక భాషల్లోకి అనువదించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
కఠిన అమలు – మూడు దశలు
నియమాల ఉల్లంఘనను కేవలం పరిపాలనా లోపంగా చూడమని కోర్టు హెచ్చరించింది. అమలుకు మూడు దశల వ్యవస్థ అమలు చేయాలని పేర్కొంది:
మొదటి దశలో జరిమానాలు, అదేపనిగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే పర్యావరణ చట్టాల కింద క్రిమినల్ కేసులు, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపైనా చర్యలు, అవసరమైతే తక్షణ విచారణల కోసం మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి కఠిన అమలు
2026 ఏప్రిల్ 1 నుంచి నియమాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులు, ట్రిబ్యునళ్ల పరిధిలో కూడా ఈ నియమాల అమలు జరిగేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తులను కోరింది.
+స్థానిక సంస్థలు వ్యర్థ ఉత్పత్తిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంటి వద్ద కంపోస్టింగ్, శానిటరీ వ్యర్థాలను సురక్షితంగా ప్యాక్ చేయడం, వేరు చేసిన వ్యర్థాలను అప్పగించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని బెంచ్ స్పష్టం చేసింది.
