Let's talk: editor@tmv.in
ఘనవిజయంతో ఆర్సీబీ ఐపీఎల్‌ ఆరంభం
ఘనవిజయంతో ఆర్సీబీ ఐపీఎల్‌ ఆరంభం

ఘనవిజయంతో ఆర్సీబీ ఐపీఎల్‌ ఆరంభం

Pinjari Chand
29 మార్చి, 2026

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగుళూరు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌ మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మలిచారు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 203/4 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది.

కోహ్లీ–పడిక్కల్ సూపర్ భాగస్వామ్యం

ఫిల్ సాల్ట్ త్వరగా ఔటైన తర్వాత కోహ్లీ–పడిక్కల్ జంట రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. పడిక్కల్ (61; 26 బంతులు) దూకుడైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, కోహ్లీ (69, 38 బంతులు) తన క్లాసిక్ షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన పడిక్కల్ మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. తరువాత కెప్టెన్ రజత్‌ పాటిదార్‌‌ 12 బంతుల్లో 31 పరుగులు తీసి విజయాన్ని మరింత సులభం చేశాడు.

డఫీ మెరుపులు

ఇంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 201/9 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్ జాకబ్‌ డఫీ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి జట్టుకు బలమైన ఆరంభం అందించాడు.

ఇషాన్‌ కిషన్ పోరాటం వృథా

ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఇషాన్‌ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో ధాటిగా ఆడాడు. హెన్రిచ్ క్లాస్సెన్‌ (31)తో కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. అయితే కీలక సమయంలో కిషన్ ఔటవడంతో జట్టు వేగం తగ్గింది. చివర్లో అనికేత్‌ వర్మ (43; 19 బంతులు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఫిల్ సాల్ట్ అందుకున్న అద్భుత క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

చిన్నస్వామిలో మారిన సీన్‌

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెలల తరబడి నెలకొన్న అనిశ్చితి తర్వాత మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. గత ఏడాది జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందిన ఘటన తర్వాత ఈ వేదికపై మ్యాచ్‌ల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. కానీ కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్ నేతృత్వంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించారు.

• కట్టుదిట్టమైన ఏర్పాట్లు

• మ్యాచ్‌కు ముందు మాక్ డ్రిల్స్ నిర్వహణ

• గేట్లు నాలుగు గంటల ముందే తెరవడం

• కబ్బన్ రోడ్, క్వీన్స్ రోడ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ

• గరుడా మాల్, ఫ్రీడమ్ పార్క్‌లలో పార్కింగ్

• గేట్ల సంఖ్య, వెడల్పు పెంపు (9 మీటర్లు)

• 80% టికెట్లు ఆన్‌లైన్ విక్రయం

మొత్తం 35 వేల సామర్థ్యానికి గాను సుమారు 29 వేల టికెట్లు మాత్రమే అమ్మడంతో జనసమ్మర్ధం తగ్గింది. స్టేడియం బయట జెర్సీ విక్రేతలు, టాటూ కళాకారులను కూడా పరిమితం చేశారు.

గత ఏడాది మృతుల జ్ఞాపకార్థం ఆర్సీబీ ఆటగాళ్లు ‘11’ నెంబర్ జెర్సీలు ధరించారు. మ్యాచ్‌కు ముందు నిమిషం మౌనం పాటించగా, ‘ఫరెవర్‌‌ ఇన్‌ అవర్‌‌ హార్ట్స్‌ ’ సందేశం స్టేడియం స్క్రీన్‌లపై ప్రదర్శించారు. అలాగే ఆ 11 మంది మరణించిన అభిమానులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు.

ఘనవిజయంతో ఆర్సీబీ ఐపీఎల్‌ ఆరంభం - Tholi Paluku