Let's talk: editor@tmv.in
ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్

ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్

Panthagani Anusha
15 నవంబర్, 2025

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘణనంగా ప్రారంభమైంది. ఈసమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని ఆదిశగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన, అత్యుత్తమ విధానాలను ఆచరిస్తూ అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని, గతంలో హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా మార్చిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని ఉప రాష్ట్రపతి తెలిపారు. దేశంలో ఈ-గవర్నెన్స్, డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయని, టెక్నాలజీ, నాలెడ్జ్-డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రెండు మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా,అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా నిలుస్తుందని, 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో ఇంధన స్వయం సమృద్ధిని సాధిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విజనరీ అని, ఆయన ఏపీ అభివృద్ధి గురించే కాక యావత్ భారతదేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తారని కొనియాడారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతోందని, విశాఖను గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా అభివర్ణించారు. 30 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు, 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణల ద్వారా భారత్ వృద్ధి చెందుతోందని తెలిపారు. ఢిల్లీలో 'భారత్ మండపం' ఉన్నట్టే, వాణిజ్య ప్రదర్శనల కోసం ఏపీలో 'ఆంధ్రా మండపం' నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దార్శనికత, ఆవిష్కరణ, ఆశయం, వృద్ధి విశాఖకు నిర్వచనం అని తెలిపారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీ మొదటి స్థానంలో ఉందని, ప్రస్తుతం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో ముందుకు వెళుతున్నామని ప్రకటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించి ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీకి గ్రోత్ ఇంజన్‌గా, విశాఖపట్నం గ్రోత్ కారిడార్‌గా మారుతున్నాయని, కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా అభివృద్ధి వేగంగా జరుగుతోందని లోకేష్ పేర్కొన్నారు.

అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా కె.ఎల్లా, బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్ సంజీవ్ బజాజ్, లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. సంజీవ్ బజాజ్ విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలలో రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సదస్సులో పాల్గొన్న భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకువెళ్తోందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందని చెప్పారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రపంచానికి వాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు జీనోమ్ వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్‌ను తయారు చేశారని... అదే జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కోవిడ్‌కు వ్యాక్సీన్ తయారు చేసి అందించిందని సుచిత్రా ఎల్లా వివరించారు.

మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి గ్రోత్ ఇంజిన్‌లా ముందుందని అన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీరం కలిగిన ఏపీ ట్రేడ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు గేట్ వే గా ఉంటోందన్నారు. యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు... విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి ప్రసంగిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోందని... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఈ రంగాల్లో ముందడుగు వేస్తోందని అన్నారు. ఏపీ వృద్ధిలో భారత్ ఫోర్జ్ కూడా భాగస్వామి అవుతోందని వెల్లడించారు. నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్జ్ నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో ఏపీలో పనిచేస్తున్నామని... రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాలు కల్పించే అంశంలోనూ భారత్ ఫోర్జ్ సంస్థ భాగస్వామి అయ్యిందని అమిత్ కల్యాణి వివరించారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ... ఏపీ ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు కలలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లులూ గ్రూప్ అత్యాధునిక మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని అలీ చెప్పారు.

ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ - Tholi Paluku