Let's talk: editor@tmv.in
ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్

ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్

Gaddamidi Naveen
9 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.అంతర్జాతీయ, ఆర్థిక సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు.తెలంగాణను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ప్రసంగించిన ఆయన, 2047 నాటికి భారత జీడీపీలో 10 శాతం వాటా తెలంగాణదిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.

కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేదే తమ ఆశయమన్నారు. ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న‘ తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రస్తుతం తెలంగాణకు దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, భారత జీడీపీలో 5 శాతం వాటా అందిస్తున్నామని, ఈ సామర్థ్యాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం సమగ్ర వ్యూహాలు రూపొందిస్తోందని చెప్పారు. ఆ దిశగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ను ఉదాహరణగా చూపిన రేవంత్ రెడ్డి, అక్కడి ప్రభుత్వం 20 ఏళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి, వేగవంతమైన వృద్ధిని సాధించిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అదే మోడల్‌ను అనుసరించి అభివృద్ధిని వేగవంతం చేస్తామని చెప్పారు.

1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారు అని. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించారు అని సీఎం అన్నారు. దేశ భవిష్యత్తుగా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి మేము ప్రేరణ పొందాం.తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014 లో సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నామని, దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించిందని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించే మోడల్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు వివరించారు.

• కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ

• పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ

• రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ

రాష్ట్ర ఏర్పాటుకు పది సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సమయంలో, తెలంగాణను దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడో స్థానాన్ని చేరుకోబోతుందని అన్నారు. భారతదేశం బలమైన సెక్యూరిటీ వాతావరణం, అంతర్గత స్థిరత్వంతో ముందుకు సాగుతుండగా, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ: గవర్నర్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కీలక మలుపుగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. విజన్‌ నుంచి అమలు దిశగా మారుతున్న ఈ దశలో, భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే జాతీయ లక్ష్యంతో పాటు, తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని ధైర్యంగా సాధన చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న అభివృద్ధి సూచికలు ఈ దిశలో జరుగుతున్న ప్రగతికి నిదర్శనమని గవర్నర్ అన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సమగ్ర వృద్ధి మోడల్‌ను అనుసరిస్తోందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత, చిన్నారులు ఈ నాలుగు వర్గాలను కేంద్రంగా ఉంచి ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు.వికసిత్ భారత్ 2047 లక్ష్యం, తెలంగాణ రైజింగ్ 2047 దిశానిర్దేశం రెండూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికలకు ప్రతీకలని గవర్నర్ అన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు పరిశ్రమల ప్రతినిధులు, కార్పొరేట్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధిపై విస్తృతమైన చర్చలు జరగగా, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 1 లక్ష కోట్లు పెట్టుబడి: ట్రంప్ మీడియా డైరెక్టర్ ఎరిక్ స్వైడర్

ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఈ దశలో, తెలంగాణ తన సామర్థ్యాన్ని మరింత బలంగా నిరూపించుకుంటోందని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ సదస్సులో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు వచ్చే పది సంవత్సరాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

"భారతదేశం ఇప్పుడు ప్రపంచ టేక్ హబ్‌గా మారుతోంది. గ్లోబల్ టెక్నాలజీ క్యాపిటలిస్టులందరూ భారత వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ ఎదుగుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఇది ప్రపంచాన్ని నడిపించే టెక్ శక్తిగా మరింత ముందుకు సాగుతుంది" అని స్వైడర్ అన్నారు.

తెలంగాణలో ప్రతిపాదిత భవిష్యత్ పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, ముఖ్యంగా ‘ఫ్యూచర్ సిటీ’, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం వల్ల భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయదలచుకుంటున్న విషయం ఏమంటే, మా సంస్థలు వచ్చే దశాబ్దంలో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణలో సార్వత్రిక అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగిస్తాయని. ఈ అవకాశం రావడం పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని అని ఆయన అన్నారు.

స్వైడర్ ప్రస్తుతానికి రెనాటస్ టాక్టికల్ అక్విజిషన్ కార్ప్‌లో సీఈఓ, బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్ప్ సీఈఓగా పనిచేశారు. ఆ సంస్థ తరువాత ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీతో విలీనం అయింది.కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం హైదరాబాద్‌లో ఒక వీధికి ఆయన పేరు పెట్టిన విషయాన్ని స్వైడర్‌కు తెలియజేశారు. సమ్మిట్‌లో పలు దేశాల ప్రతినిధులు, కార్పొరేట్ ప్రముఖులు పాల్గొన్నారు.

భారతాభివృద్ధికి బెంగళూరు–హైదరాబాద్ కలిసి నడవాలి: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్

భారత టెక్నాలజీ రంగ అభివృద్ధిలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు పరస్పరం పోటీదారులు కాకుండా, ఒకరినొకరు తోడ్పడుతూ ముందుకు సాగాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అన్నారు. ప్రారంభ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారత రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందితే దేశం మరింత ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ బెంగళూరుతో పోటీ పడుతోంది అనుకున్నాను. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలిసింది తెలంగాణ పోటీ ప్రపంచస్థాయిలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయనను అభినందించిన శివకుమార్, "దక్షిణాది అంతా మీతో ఉంది. దేశాన్ని ప్రపంచానికి సరితూగే స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం మన దక్షిణ రాష్ట్రాలకే ఉంది" అని తెలిపారు. నేను ఇక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే రాలేదు; దక్షిణాది రాష్ట్రాల ఏకతను ప్రతిబింబించే ప్రతినిధిగా వచ్చాను. తెలంగాణ చూపుతున్న విజన్ ప్రపంచ దృష్టిలో ఉందని నాకు స్పష్టమైంది. తెలంగాణ చిన్న రాష్ట్రం కావొచ్చు, కానీ మీ ఆలోచన పెద్దది అని అన్నారు.

భారత్ టెక్నాలజీ కథను చెప్పాలంటే బెంగళూరు, హైదరాబాద్‌ను విడిగా చూడలేమని ఆయన పేర్కొన్నారు. మమ్మల్ని చాలామంది పోటీదారులుగా చూపించాలని ప్రయత్నించారు. కానీ నిజం వేరే. మనం ఒకరినొకరు ప్రోత్సహించాలి, కలిసి ఎదగాలి. అప్పుడు మాత్రమే మంచి భారత్, మంచి ప్రపంచాన్ని నిర్మించగలం అని అన్నారు. ఆయన రతన్ టాటా వ్యాఖ్యలను ఉదహరిస్తూ “ఎక్కువ దూరం నడవాలంటే కలిసే నడవాలి” అని పేర్కొని, బెంగళూరు, హైదరాబాద్ కలిసి పనిచేయాలని సూచించారు. అమెరికా కాలిఫోర్నియాలో 13 లక్షల ఇంజనీర్లు పనిచేస్తున్నప్పటికీ, బెంగళూరులోనే 25 లక్షల ఇంజనీర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ, హైదరాబాద్‌లోను అపార మానవ వనరులు ఉన్నాయి. మనం కలిసి పనిచేస్తే దక్షిణాదిని ఎవరు ఆపలేరు అని శివకుమార్ అన్నారు.

దక్షిణ రాష్ట్రాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రపంచంలో ఏ దేశమూ భారతదేశంతో పోటీ పడలేదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వైపు చూస్తూ, కేంద్రం దక్షిణాది అభివృద్ధికి మరింత సహకారం అందిస్తుందని ఆశ వ్యక్తం చేశారు. సమ్మిట్‌కు పలు దేశాల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు హాజరై, బెంగళూరు, హైదరాబాద్ టెక్ సమన్వయం పై విస్తృత చర్చలు జరిగాయి.

ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ - Tholi Paluku