
ఘనంగా ‘ప్రాజెక్ట్ స్వస్తిక్’ దినోత్సవం
ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కింలోని లోయలు, పర్వతాలు, మారుమూల ప్రాంతాలలో రోడ్ల అభివృద్దికి 1960 లో ఏర్పాటు చేసిన సంస్థ ప్రాజెక్ట్ స్వస్తిక్. ఇది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కు చెందింది. బుధవారం నాటికి ఈ సంస్థను ఏర్పాటు చేసి 65 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గ్యాంగ్ టక్లో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశంలో అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో ఆరు దశాబ్దాలకు పైగా రోడ్ల నిర్మాణంలో నిమగ్నమైంది. రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు, సాయుధ దళాల కార్యచరణకు కీలకమైన కనెక్టివిటీని మెరుగుపరుస్తోంది. ఇప్పటి వరకు అత్యంత ఎత్తైన ప్రదేశాలలో 1412 కిలోమీటర్ల రోడ్లు, 80కి పైగా ప్రధానమైన వంతెనలు నిర్మించి అందుబాటులోకి తెచ్చింది.
ఈ దశాబ్దంలో 26 వంతెనల నిర్మాణం
ఈ దశాబ్దంలోనే ప్రాజెక్ట్ స్వస్తిక్ లో భాగంగా 350 కిలోమీటర్లకు పైగా రోడ్లను, 26 వంతెనలు, ఓ సొరంగాన్ని అభివృద్ధి పరిచింది. తరచు హిమనదాల విస్పోటనలు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, వరదలు తీస్తా నదిని ముంచెత్తుతున్నప్పటికీ ప్రాజెక్ట్ స్వస్తిక్ నిర్విరామంగా కొనసాగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొని దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసి విధినిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి స్వస్తిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించి వేడుకలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సైనిక్ సమ్మేళన్, బరాఖానా లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెజిమెంటల్ క్యాంటీన్‌ను కూడా ఈ సందర్భంగా పునరుద్ధరించారు.
అలాగే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇన్ని ఆపరేషన్ చేపట్టడం వెనుక క్యాజువల్ పెయిడ్ లేబర్స్ కృషి మరువలేనిది. వారు రోడ్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారికోసం ప్రాజెక్ట్ స్వస్తిక్ అవాసాలను,సురక్షితమైన షెల్టర్లను, పారిశుద్ధ్య సౌకర్యాలను,ఆరోగ్య శిబిరాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. దాంతోపాటే రాబోయే సంవత్సరంలో రూ.1,152.66 కోట్ల విలువైన మౌలిక వసతులను కల్పించనుంది. దీంతో సాయుధ దళాలు వేగంగా తమ సామగ్రిని తరలించడానికి ఉపయోగపడుతుంది. ప్రజల జీవితాల్లో కూడా గణనీయమైన మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
