Let's talk: editor@tmv.in
ఘనంగా టిబెటన్ ప్రజల లోసార్ వేడుకలు

ఘనంగా టిబెటన్ ప్రజల లోసార్ వేడుకలు

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్న టిబెటన్ సమాజం బుధవారం తమ సాంప్రదాయ చాంద్రమాన నూతన సంవత్సర వేడుక ‘లోసార్’ను ఘనంగా జరుపుకుంది. ప్రపంచ శాంతి, సమృద్ధి, తమ ఆధ్యాత్మిక గురువు దలైలామా దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సంవత్సరం లోసార్ 2153వ సంవత్సరాన్ని సూచిస్తోంది. ఇది ‘ఫైర్ హార్స్’ (అగ్ని గుర్రం) సంవత్సరంగా భావిస్తారు. ఉదయం నుంచే ప్రముఖ బౌద్ధ మఠాల్లో టిబెటన్ సమాజం సభ్యులు చేరుకుని సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు ఇదే ఆరంభం. షిమ్లా నగర పరిసర ప్రాంతమైన పంథాఘాటిలోని తుప్తెన్ దోర్జే డ్రాక్ మఠంలో భారీ సంఖ్యలో టిబెటన్ ప్రజలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ పండుగ టిబెటన్ సమాజానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది.

మఠానికి చెందిన లామా లోపెన్ లోదోస్ మాట్లాడుతూ నూతన సంవత్సరం తొలి రోజున దీపాలను వెలిగించి, ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశాం. మానవాళి సంక్షేమం, అలాగే హిమాచల్ ప్రదేశ్ శాంతి, అభివృద్ధి కోసం మంత్రోచ్ఛారణలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మశాలలో కేంద్రంగా ఉన్న టిబెటన్ ప్రవాస ప్రభుత్వమైన సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ కేబినెట్ (కషాగ్) అధిపతి సిక్యోంగ్ పెంపా సెరింగ్ టిబెటన్ సమాజానికి సందేశం ఇచ్చారు. విదేశాల్లో ఉన్న మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. ఒకే భాష, మతం, సంస్కృతి, టిబెట్ అనే పవిత్ర భూమి మనందరిదీ. ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

చైనీస్ ప్రభుత్వ విధానాల కారణంగా టిబెట్‌లో నివసిస్తున్న టిబెటన్ ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. టిబెట్ ప్రత్యేకత, భాష, మతం, సంస్కృతి, పర్యావరణాన్ని క్రమంగా చెరిపివేయడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి టిబెటన్ ప్రజలు తమ సంస్కృతి, విశ్వాసాలను కాపాడుకుంటూ ధైర్యంగా నిలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని దలైలామా చూపిన దారిలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లోసార్ కొత్త ఆరంభానికి సంకేతం అని తెలిపారు.

టిబెటన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుంది

ఇక అమెరికా సెనేటర్ మార్కో రూబియో లోసార్ సందర్భంగా టిబెటన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి హక్కులకు అమెరికా మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. టిబెటన్ అంశాలను పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించినట్లు ప్రకటించారు. టిబెటన్ ప్రజల భాష, సంస్కృతి, మత వారసత్వాన్ని కాపాడటానికి అమెరికా కట్టుబడి ఉందని రూబియో తెలిపారు. ఈ ప్రకటనను సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ స్వాగతించింది. టిబెటన్ మత, సాంస్కృతిక, భాషా పరిరక్షణకు ఇది తోడ్పడుతుందని, టిబెట్ సమస్యపై సంభాషణకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.