Let's talk: editor@tmv.in
ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం

Panthagani Anusha
29 డిసెంబర్, 2025

దేశ స్వాతంత్ర సముపార్జనలోనూ, నవ భారత నిర్మాణంలోనూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అజరామరమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె. మస్తాన్ వాలి స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ వాలి పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మస్తాన్ వాలి మాట్లాడుతూ త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువల పునాదులపై కాంగ్రెస్ పార్టీ నిర్మితమైందని కొనియాడారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీయే కానీ స్వాతంత్ర సమరంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు నేడు చరిత్రను వక్రీకరిస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కనీసం నలుగురు బీజేపీ నేతల పేర్లను చెప్పగలరా? అని ఆయన సవాల్ విసిరారు.

దేశంలోని పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, లౌకికవాదం, ప్రగతి అనేవి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తోంది. ఇలాంటి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు సత్యం, ధైర్యంతో పోరాడాలి అని పిలుపునిచ్చారు.

దేశ ఐక్యతే లక్ష్యం

దేశ ఏకతను, అఖండతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని లౌకిక స్ఫూర్తిని దెబ్బతీయాలని చూసే శక్తులను అడ్డుకుంటామని మస్తాన్ వాలి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం - Tholi Paluku