Let's talk: editor@tmv.in
గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్ - బ్రెజిల్: మోడీ

గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్ - బ్రెజిల్: మోడీ

Dantu Vijaya Lakshmi Prasanna
22 ఫిబ్రవరి, 2026

రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో మోడీ, లూలా మద్య 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల) ప్రయోజనాలపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత్, బ్రెజిల్ వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, అంతర్జాతీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక మరింత బలంగా వినబడుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రపంచ నిర్ణయాల్లో ఈ దేశాల భాగస్వామ్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఐక్యరాజ్యసమితి వంటి పాతబడిన అంతర్జాతీయ సంస్థలు విఫలమవుతున్నాయని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లోబల్ గవర్నెన్స్ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని, నిర్ణయాధికారంలో మరిన్ని దేశాలకు చోటు కల్పించాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ దిశగా భారత్, బ్రెజిల్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

దౌత్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం

ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, ఏ సమస్యనైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. యుద్ధం దేనికీ పరిష్కారం కాదని ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో, ఉగ్రవాదం, దానికి మద్దతు ఇచ్చే శక్తులు మానవాళికే శత్రువులని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించకూడదని ఇరు దేశాలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి.

వ్యవసాయం, ఆహార భద్రతలో సహకారం

రెండు దేశాల ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులను తట్టుకోగల పంటలు, ఆధునిక సాంకేతికతతో కూడిన 'ప్రిసిషన్ ఫార్మింగ్', రసాయన రహిత జీవ ఎరువుల వినియోగంలో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ఇది రెండు దేశాల రైతులకు, ఆహార నిల్వలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.

అలాగే, భవిష్యత్తు ఇంధన అవసరాలకు అవసరమైన 'క్రిటికల్ మినరల్స్', 'రేర్ ఎర్త్స్' (అరుదైన ఖనిజాలు) విషయంలో భారత్, బ్రెజిల్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాలు, చిప్ తయారీకి అవసరమైన ఈ ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేలా ఒక పటిష్టమైన సప్లై చైన్‌ను నిర్మించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్, బ్రెజిల్ మధ్య రక్షణ రంగంలో సహకారం క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక అనుసంధానానికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రక్షణ పరికరాల తయారీ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిలో ఈ భాగస్వామ్యం మరింత ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనితోపాటు, ప్రజలకు సరసమైన ధరకే నాణ్యమైన మందులు అందించడంలో భారత్ ప్రపంచానికి ఫార్మసీగా ఉందని, బ్రెజిల్‌కు కూడా ఈ సరఫరాను పెంచుతామని మోడీ హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల మార్కును దాటించాలని ఇరు దేశాల ప్రతినిధులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం బ్రెజిల్ నుంచి పెద్ద ఎత్తున సీఈఓల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంది.

సమీక్ష అనంతరం అధ్యక్షుడు లూలాకు రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్, అధికారిక స్వాగతం లభించింది. తరువాత ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ చర్చల్లో మోడీ తోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

2025లో మోదీ బ్రెజిల్ పర్యటన తర్వాత, ఇప్పుడు లూలా భారత్‌కు రావడం అనేది ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలం తర్వాత ఏర్పడిన అత్యంత సన్నిహిత సంబంధాలకు సంకేతంగా నిలుస్తోంది.

వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త శక్తి

ఈ కార్యక్రమం అనతరం మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో అధ్యక్షుడు లూలా పాల్గొనడం మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త శక్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

"అధ్యక్షుడు లూలా, ప్రముఖ మంత్రులు, వ్యాపార నాయకులతో కూడిన ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడం భారత్‌కు దక్కిన గౌరవం. భారత్-బ్రెజిల్ సంబంధాలు అధ్యక్షుడు లూలా యొక్క దూరదృష్టి, స్ఫూర్తిదాయక నాయకత్వం వల్ల ఎంతో కాలంగా ప్రయోజనం పొందుతున్నాయి. ఏఐ సమ్మిట్‌లో ఆయన ఉనికి మా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. మా చర్చలు వివిధ రంగాలలో భారత్-బ్రెజిల్ స్నేహానికి సంబంధించిన అన్ని అంశాలపై జరిగాయి” అని తెలిపారు

కాగా, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆహ్వానించడం పట్ల అధ్యక్షుడు లూలా హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

.