
గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అభినందనీయం
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు. రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చాటిచెప్పే విధంగా రూపొందిన ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని వారు ప్రశంసించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులను కలిసి గ్లోబల్ సమ్మిట్ గురించి వివరించారు. అలాగే ఈ నెల 13న ఉప్పల్ లో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కు అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు లయోనల్ మెస్సీ వస్తున్నారని, ఆ కార్యక్రమానికి రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, వేణుగోపాల్ తదితరులను ఆహ్వానించారు.
ఢిల్లీలో ఖర్గే, ప్రియాంక గాంధీల నివాసాల్లో జరిగిన సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతంగా నిర్వహించిన తీరు, సమిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులపై అగ్రనేతలకు వివరాలు అందించారు. సమిట్‌లో కుదిరిన ఒప్పందాలు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇస్తాయని తెలిపారు. సీఎం చేసిన కృషిని ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశంసించారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి
దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని నివాసంలో సీఎం ప్రణబ్ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న అరుదైన ఫుట్‌బాల్ పోరు
మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ రూపంలో అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్–9 జట్టు తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ అపూర్వ సమరంపై ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాజకీయ నాయకుడు వర్సెస్ ప్రపంచ ఫుట్‌బాల్ ప్లేయర్ మధ్య పోటీ కావడంతో ఈ మ్యాచ్ అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్ పర్యటనలో భాగంగా పిల్లల కోసం ఓ ప్రత్యేక ఫుట్‌బాల్ శిక్షణా శిబిరాన్ని మెస్సీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ శిబిరంలో మెస్సీ స్వయంగా టిప్స్ ఇవ్వనున్నారని నిర్వాహకులు తెలిపారు.
