
గ్లోబల్ సమ్మిట్‌లో నిరసనలు దేశ ప్రతిష్టకు భంగకరం: కేటీఆర్ ఆగ్రహం
ఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు వాడుకోవడం దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు తగ్గించడమేనని ఆయన శనివారం 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
అదే సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన యూత్ కాంగ్రెస్ గొడవకు దిగడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ, ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ విభేదాలను ప్రదర్శించడానికి సమయం, సందర్భం ఉంటాయని, అంతర్జాతీయ సదస్సులు అస్సలు అందుకు వేదికలు కావని ఆయన స్పష్టం చేశారు. స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టవద్దని హితవు పలికారు.
