Let's talk: editor@tmv.in
గ్లోబల్ మార్కెట్‌లోకి 412 మిలియన్ బ్యారెళ్ల చమురు!

గ్లోబల్ మార్కెట్‌లోకి 412 మిలియన్ బ్యారెళ్ల చమురు!

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

అంతర్జాతీయ మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్న ముడిచమురు ధరలకు కళ్లెం వేసేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) రంగంలోకి దిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన సభ్య దేశాల అత్యవసర నిల్వల నుంచి భారీ స్థాయిలో చమురును విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పారిస్ కేంద్రంగా పనిచేసే ఐఈఏ ఆదివారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ సప్లై చైన్‌లో ఏర్పడిన లోటును భర్తీ చేస్తూ ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ సమిష్టి చర్యకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొంది.

తక్షణమే ఆసియా దేశాల నుంచి సరఫరా

ఐఈఏ తాజా నిర్ణయంతో ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లోని సభ్య దేశాలు తక్షణమే తమ నిల్వలను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. యూరప్, అమెరికా ఖండాలలోని దేశాలు ఈ నెల చివరి నాటికి తమ వంతు చమురు నిల్వలను మార్కెట్‌లోకి పంపిణీ చేస్తాయి. ఈ సమన్వయ చర్య వల్ల అంతర్జాతీయ మార్కెట్‌కు ఒక బలమైన భరోసా లభిస్తుందని ఐఈఏ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో విడుదల చేసిన 182.7 మిలియన్ బ్యారెళ్ల కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

412 మిలియన్ బ్యారెళ్ల నిబద్ధత

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఐఈఏ సభ్య దేశాలు మొత్తం 411.8 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో ప్రభుత్వం, పరిశ్రమలు, ఇతర వర్గాల నిల్వలు కలిసి ఉన్నాయి. మొత్తం విడుదలలో దాదాపు 72 శాతం ముడిచమురు ఉండగా, మిగిలిన 28 శాతం రిఫైన్డ్ చమురు ఉత్పత్తులు ఉంటాయని ఐఈఏ స్పష్టం చేసింది. గత బుధవారం 400 మిలియన్ బారెళ్లుగా ప్రకటించిన ఈ సంఖ్య, తాజా అప్డేట్ ప్రకారం మరింత పెరిగింది.

యుద్ధం ముగిస్తే ధరలకు ఉపశమనం

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరిగాయని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్రికత్తలు మరికొన్ని వారాల్లో ముగిసే అవకాశం ఉందని, ఆ తర్వాత అంతర్జాతీయంగా సరఫరా పుంజుకొని ధరలు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రభావంతో పెరిగిన గ్యాస్ ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఐఈఏ తీసుకున్న ఈ భారీ అత్యవసర నిల్వల విడుదల నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లోకి 412 మిలియన్ బ్యారెళ్ల చమురు! - Tholi Paluku