
గ్లోబల్ మార్కెట్లతో రైతులను అనుసంధానించడంలో కాంగ్రెస్ విఫలం: చౌహాన్
భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ ఒప్పందం వ్యవసాయ రంగానికి పూర్తి రక్షణ కల్పిస్తుందని, రైతుల ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలే ప్రధానమని చౌహాన్ స్పష్టం చేశారు. రైతులకు కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఈ ఒప్పందం నుంచి మినహాయించామని తెలిపారు. ఈ ఒప్పందంలో భారత రైతులకు నష్టం కలిగించే ఉత్పత్తి ఒక్కటీ లేదని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్ దేశాన్ని సంవత్సరాల తరబడి పాలించినప్పటికీ, రైతులను ఏ గ్లోబల్ మార్కెట్‌తోనూ అనుసం ధానించలేకపోయిందని, భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం గానీ వృద్ధి గానీ అందించలేదని ఆయన విమర్శించారు. దీనికి భిన్నంగా, స్వాతంత్ర్య సమయానికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, కాంగ్రెస్ పాలనలో 11వ స్థానానికి దిగజారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు వేగంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ఇటీవల ప్రకటించగా, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకం 18 శాతానికి తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇది ఒప్పందం కాదని, దేశ ఆత్మగౌరవానికి లొంగుబాటేనని ఆరోపించింది. భారత్ త్వరలోనే అమెరికా ఉత్పత్తుల ‘డంపింగ్ గ్రౌండ్’గా మారుతుందని కాంగ్రెస్ మీడియా విభాగం నేత పవన్ ఖేరా విమర్శించారు.
ప్రతిపక్షాలు అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయి
ఈ ఆరోపణలను ఖండించిన చౌహాన్, వ్యవసాయం నాశనం అవుతుందంటూ ప్రతిపక్షాలు అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని అన్నారు. రైతులకు ప్రధాన బలంగా ఉన్న అన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఒప్పందం నుంచి పూర్తిగా బయటే ఉంచామని స్పష్టం చేశారు. జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించబోమని చౌహాన్ తేల్చిచెప్పారు. ఇది భారత వ్యవసాయ స్వచ్ఛతను కాపాడే కీలక నిర్ణయమని, నేల, విత్తనాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. మాంసం, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు, మసాలాలు సహా అనేక ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి సుంక రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. పొట్టు తీసిన ధాన్యాలు, పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, బీన్స్, దోసకాయలు, పుట్టగొడుగులు, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు అలాగే మిశ్రమ డబ్బాల్లో నిల్వ ఉంచిన కూరగాయలకు భారత్‌లో ప్రవేశం ఉండదని ఆయన తెలిపారు. ఈ చర్యలన్నీ భారత రైతు కుటుంబాల జీవనాధారాలను రక్షించేందుకు తీసుకున్నవేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
