
గ్లోబల్ భాగస్వాములతో భారత్ గాఢ సంబంధాలు: జై శంకర్
భారత్ ఇప్పుడు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, రాజకీయంగా బలంగా ఉన్న స్థితి నుంచి అంతర్జాతీయ భాగస్వాములతో మరింత గాఢంగా మమేకమవుతోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన పలు వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక బలాన్ని చూపిస్తున్నాయని ఆయన అన్నారు. మంగళవారం గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో ప్రసంగించిన జై శంకర్, అమెరికాతో కుదిరిన ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించారు. ఈ సదస్సు ఫ్యూచర్ ఎకనామిక్ కోఆపరేషన్ కౌన్సిల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి అత్యంత అస్థిరంగా మారిందని ఆయన హెచ్చరించారు. ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థల వెపనైజేషన్, కఠిన ఎగుమతి నియంత్రణలు, మార్కెట్ ఒడిదుడుకులు పెరుగుతున్నాయని అన్నారు. స్థిరమైన గ్లోబల్ వ్యవస్థ మారుతోంది. దానికి ప్రత్యామ్నాయాలను సృష్టించడం కష్టం. ముందున్న కాలం అనిశ్చితితో, ప్రమాదాలతో నిండి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ అనంతరం, అమెరికా భారత ఉత్పత్తులపై విధించిన సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్టు ప్రకటించారు.
అయితే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. గత నెలలో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) చర్చలు ముగిశాయని జైశంకర్ గుర్తుచేశారు. అదనంగా యూకే, న్యూజిలాండ్, ఒమన్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఆర్థిక భద్రత కోసం స్వావలంబనతో పాటు విశ్వసనీయ భాగస్వాములు అవసరమని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు యుగంలో ఆర్థిక నిర్ణయాల్లో రాజకీయాలు, భద్రత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో ఆర్థిక నిర్ణయాల్లో రాజకీయాలు, భద్రత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా తిరిగి పారిశ్రామికీకరణ పై దృష్టి పెట్టిందని, ఇది దాని సాంకేతిక భవిష్యత్తుకు కీలకమని చెప్పారు. చైనా తయారీ, ఎగుమతులపై దృష్టి కొనసాగుతుందని, ఇంకా విస్తరించవచ్చని వ్యాఖ్యానించారు. సాంకేతిక పోటీ తీవ్రతరం అవుతోందని, ఇంధన వాణిజ్య మార్గాలు పునర్నిర్వచించబడుతున్నాయని, కొత్త ఆలోచనా విధానాలు ఎక్కువ రిస్క్ తీసుకునే దిశగా దేశాలను నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వలసలు, చలనశీలత కూడా వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయని చెప్పారు. ప్రతి దేశం తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని జైశంకర్ పేర్కొన్నారు.
