
గ్లోబల్ ట్రేడ్ వార్‌లో భారత్ కీ రోల్: జెనీవాలో రాజేష్ అగర్వాల్ ‘దౌత్య’ వ్యూహం!
14వ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) మంత్రివర్గ సమావేశం (ఎమ్‌సి14) 2026, మార్చి 26 నుండి 29 వరకు జరుగుతుంది. ఈ సమావేశం ఆఫ్రికా ఖండంలోని కామెరూన్ దేశంలో ఉన్న యావుండే నగరంలో నిర్వహించబడుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇది అత్యున్నత నిర్ణయాధికార విభాగం, దీనికి 166 సభ్య దేశాల వాణిజ్య మంత్రులు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.
కామెరూన్‌లోని యావుండేలో జరగనున్న 14వ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ ) మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ జెనీవాలో పలువురు సీనియర్ దౌత్యవేత్తలతో వరుస ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాలను ప్రారంభించారు. ఈ భేటీలు రాబోయే అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో భారత వైఖరిని బలంగా వినిపించే లక్ష్యంతో జరిగాయి.
ఈ చర్చల సందర్భంగా భారత్ ప్రధానంగా 'ఉద్దేశపూర్వక బహుళ పక్ష వాణిజ్యం' పై దృష్టి సారించింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలు, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాణిజ్య సవాళ్లను పరిష్కరించడంపై వివిధ దేశాల ప్రతినిధులతో అగర్వాల్ సుదీర్ఘంగా చర్చించారు.
యూరోపియన్ యూనియన్‌తో భేటీ
యూరోపియన్ యూనియన్ రాయబారి జోవావో అగుయార్ మచాడోతో జరిగిన సమావేశంలో, డబ్ల్యూటీఓ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఎమ్‌సి14లో చర్చకు రానున్న కీలక అంశాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
చైనాతో ప్రపంచ సవాళ్లపై చర్చ
చైనా ప్రతినిధి లీ యోంగ్జీతో జరిగిన సమావేశంలో ప్రపంచ వాణిజ్యానికి ఎదురవుతున్న అవరోధాల గురించి చర్చించారు. మంత్రివర్గ సమావేశం విజయవంతం కావాలంటే పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన చర్చలు అవసరమని ఈ చర్చల సందర్భంగా అభిప్రాయపడ్డారు.
అమెరికాతో ద్వైపాక్షిక సహకారం
అమెరికా డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ డేవిడ్ బిస్బీతో జరిగిన భేటీలో వాణిజ్య సంబంధిత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. పరస్పర సహకారంతో సవాళ్లను అధిగమిస్తూ, ఎమ్‌సి14 వేదికగా సానుకూల ఫలితాలు సాధించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
గయానా ప్రతినిధి, మత్స్య సంపద చర్చల ఛైర్మన్ లెస్లీ రామ్‌సామీతో అగర్వాల్ కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా చేపల వేటపై ఉన్న ఆంక్షలు, అతిగా చేపలు పట్టడం వంటి అంశాల్లో భారత మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయని రీతిలో నిబంధనలు ఉండాలని భారత్ కోరింది.
సౌదీ అరేబియా రాయబారి, డబ్ల్యూటీఓ జనరల్ కౌన్సిల్ ఛైర్మన్ సాకర్ అబ్దుల్లా అల్మోక్బెల్‌తో జరిగిన భేటీలో భారత్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా డబ్ల్యూటీఓలో సంస్కరణలు ఉండాలని భారత్ ప్రతిపాదించింది.
చివరిగా బ్రెజిల్ ప్రతినిధి గుల్హెర్మ్ డి అగుయార్ పాట్రియోటాతో వ్యవసాయ రంగ చర్చలు వాణిజ్య అభివృద్ధిపై అగర్వాల్ మాట్లాడారు. ఈ వరుస సమావేశాల ద్వారా ఎమ్‌సి14లో సమతుల్యమైన, సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు భారత్ తన దౌత్యపరమైన ముందడుగును వేసింది.
