
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాకిస్తాన్‌కు తొలి స్థానం
ప్రపంచ ఉగ్రవాద సూచికలో (గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ –2026) పాకిస్తాన్ తొలిసారి మొదటి స్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రవాద ఘటనలు, మరణాలు గణనీయంగా పెరగడంతో దేశ భద్రతా పరిస్థితి మరింత దిగజారినట్లు నివేదిక వెల్లడించింది. ఇన్సిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, 2025లో పాకిస్తాన్‌లో 1,139 మంది ఉగ్రదాడుల్లో మృతి చెందగా, మొత్తం 1,045 ఘటనలు నమోదయ్యాయి. ఇది 2013 తర్వాత అత్యధిక స్థాయి అని పేర్కొంది. ప్రత్యేకంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు అయిన తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ), బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) కార్యకలాపాలు పెరగడం భద్రతా పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయని నివేదిక తెలిపింది.
టీటీపీ దేశంలో అత్యంత ప్రమాదకర ఉగ్ర సంస్థగా మారడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యంత ఘోర సంస్థగా నిలిచింది. 2009 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో జరిగిన మొత్తం దాడుల్లో 67 శాతం వరకు టీటీపీదే భాగమని అంచనా. 2025లో ఈ సంస్థ దాడులు 24 శాతం పెరిగి 595కు చేరుకున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో జరిగిన దాడుల్లో 637 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది 2011 తర్వాత అత్యధికం. అలాగే, బందీలుగా తీసుకునే ఘటనలు కూడా విపరీతంగా పెరిగాయి. 2024లో 101గా ఉన్న బందీలు, 2025లో 655కు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 442 మందిని బందీలుగా తీసుకోవడం పెద్ద ఘటనగా నిలిచింది. పాకిస్తాన్ భద్రతపై ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభావం కూడా తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. కాబూల్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం, టీటీపీ కార్యకలాపాలకు బలాన్నిచ్చిందని విశ్లేషించింది.
దేశంలో ఉగ్రదాడులలో 74 శాతం, మరణాలలో 67 శాతం బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతాల్లోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ స్థాయిలో కూడా పాకిస్తాన్ పరిస్థితి తీవ్రంగానే ఉందని నివేదిక హెచ్చరించింది. బుర్కినా ఫాసో, నైజీరియా, నైజర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలతో కలిసి ప్రపంచ ఉగ్ర మరణాల్లో 70 శాతం వరకు ఈ దేశాలే వాటా పంచుకుంటున్నాయని తెలిపింది. గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్, ఈసారి మొదటి స్థానానికి చేరుకోవడం దేశ స్థిరత్వం క్రమంగా దెబ్బతింటోందనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
టాప్ టెన్ దేశాలు
పాకిస్తాన్, బుర్కినా ఫాసో, నైజీరియా, నైజర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మాలి, సోమాలియా, ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా టాప్ టెన్ దేశాల్లో ఉన్నాయి.
