Let's talk: editor@tmv.in
గ్లోబల్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌కు ఏపీ యువతి కైవల్య ఎంపిక

గ్లోబల్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌కు ఏపీ యువతి కైవల్య ఎంపిక

Panthagani Anusha
8 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో ప్రతిభ అంతర్జాతీయ వేదికపై తెలుగు జాతి గర్వాన్ని అలరించింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 17 ఏళ్ల కుంచాల కైవల్య రెడ్డి అమెరికా ఫ్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్వహించే గ్లోబల్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌‌లో పాల్గొనే కొత్త వ్యోమగామిగా ఎంపికైంది. 2029లో చేపట్టనున్న అంతరిక్ష మిషన్‌కు శిక్షణ భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది యువతీ–యువకులు పోటీ పడగా, కేవలం 150 మందికి మాత్రమే అవకాశం లభించడం, వారిలో కైవల్య స్థానం దక్కడం గమనార్హం. ఈ శిక్షణ నాలుగేళ్లపాటు కొనసాగనుండగా, విజయవంతంగా పూర్తి చేసినవారు 2029లో అంతరిక్షయాత్రకు వెళ్తారు. ఈ యాత్రలో బృందం భూమి నుంచి సుమారు 300 కి.మీ ఎత్తులో కక్ష్యలో తిరుగుతూ, 5 గంటల పాటు స్పేస్‌లో ఉండనున్నారు. అందులో సుమారు మూడు గంటలపాటు జీరో గ్రావిటీ అనుభవం పొందే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలు మార్గనిర్దేశం చేయనున్నారు. నాసా మాజీ వ్యోమగామి, 224 రోజులు అంతరిక్షంలో గడిపిన విలియం మెక్ ఆర్థర్, బ్రెజిల్ తొలి వ్యోమగామి మార్కోస్ పోంటెస్ వంటి నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ జరుగనుంది.

కాగా సైన్స్‌ రంగంలో కైవల్య ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ముందే గుర్తింపు పొందింది. చిన్న వయస్సులోనే మంగళ–గురుడు గ్రహాల మధ్య ఉన్న గ్రహశకల మండలాన్ని గుర్తించిన ఆమె సైన్స్ వేత్తల ప్రశంసలు అందుకుంది. ఈ విజయమే ఆమెకు మరింత అవకాశాల దారిని తెరిచింది.

కైవల్య అంతరిక్ష శిక్షణకు ఎంపిక అయిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలిపింది. దేశానికి, రాష్ట్రానికి గౌరవం తెస్తున్న యువతలో కైవల్య ఒకరని ప్రభుత్వం ప్రశంసించింది. ఈ విజయంతో భారత యువతకు ఆమె ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కైవల్య కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితులు ఆమె సాధనపై గర్వంతో హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అమెరికాలో ఆమె ప్రత్యేక శిక్షణ పొందనుంది. కైవల్య వంటి యువ ప్రతిభలే భవిష్యత్‌లో భారత్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపుతాయి. ఆమె సాధన లక్షలాది మంది తెలుగు బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తుంది” అని ప్రభుత్వం కొనియాడింది.

గ్లోబల్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌కు ఏపీ యువతి కైవల్య ఎంపిక - Tholi Paluku