Let's talk: editor@tmv.in
గ్రోక్ చాట్‌బాట్‌పై అనుమానాలు?

గ్రోక్ చాట్‌బాట్‌పై అనుమానాలు?

Yekkirala Akshitha
6 డిసెంబర్, 2025

మీరు ఇంటర్నెట్‌లో ఎప్పుడైనా మీ వ్యక్తిగత సమాచారాన్ని (అతి చిన్న వివరమైనా సరే) పంచుకుని ఉంటే, ఇప్పుడు మీ ప్రైవేట్ డేటాకు మీరు ఊహించని పెద్ద ముప్పు ఎదురైంది. కారణం: ఎలోన్ మస్క్ కొత్తగా రూపొందించిన 'గ్రోక్' అనే కృత్రిమ మేధస్సు చాట్‌బాట్. ఎవరైనా అడిగితే మీ అత్యంత రహస్య వివరాలను సైతం సులభంగా ఇచ్చేందుకు ఇది సిద్ధంగా ఉంది.

సృజనాత్మకత, క్షణంలో ప్రపంచ జ్ఞానాన్ని అందించడంలో సరిహద్దులను దాటుతుందని భావించిన ఈ ఏఐ నమూన ఇప్పుడు ఒక భయంకరమైన విషయంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది: కేవలం చిన్నపాటి ప్రశ్నలకే, ప్రముఖ వ్యక్తులదే కాక, అత్యంత సాధారణ పౌరుల యొక్క నివాస చిరునామాలు, వ్యక్తిగత వివరాలను కూడా ఇది బయటపెట్టేస్తోంది.

వ్యక్తిగత వివరాలను క్షణాల్లో :

ఈ వారం మొదట్లో, 'ఫ్యూచరిజం' అనే వార్తా సంస్థ, ప్రముఖ క్రీడా విశ్లేషకుడు డేవ్ పోర్ట్‌నాయ్ చిరునామాను సాధారణ X (పూర్వపు ట్విట్టర్) వినియోగదారులు అడిగితే, గ్రోక్ తక్షణమే ఇచ్చేసినట్లు నివేదించింది. ఇది అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు కాదు, అనేక పరీక్షలలో ఇది పదే పదే రుజువైంది. "చిరునామా," "ఫోను సంఖ్య," "[పేరు] ఎక్కడ నివసిస్తారు," లేదా "[పేరు] గురించిన వివరాలు" వంటి ప్రాథమిక ప్రశ్నలకు కూడా హెచ్చరికలు ఇవ్వకుండా లేదా భద్రత కారణాల వల్ల నిరాకరించకుండా, గ్రోక్ సరికొత్త, సరైన వ్యక్తిగత వివరాలను క్షణాల్లో అందించింది.

ముప్పై మూడు మంది సాధారణ వ్యక్తులపై జరిపిన పరిశీలనలో ఈ ప్రమాదం యొక్క స్థాయి వెల్లడైంది. పది కేసుల్లో, గ్రోక్ వారి ప్రస్తుత ఇంటి చిరునామాలను వెంటనే అందించింది. మరో ఏడు ఫలితాలలో పాత చిరునామాలను వెల్లడించింది. నాలుగు స్పందనలలో ఖచ్చితమైన పని ప్రదేశాలను (ఉద్యోగం చేసే స్థలాన్ని) ఇచ్చింది. "సంప్రదింపుల సమాచారం," "వ్యక్తిగత వివరాలు," "కుటుంబ సమాచారం" వంటి ప్రశ్నలకు కూడా ఇది స్పందించింది. దీని అర్థం ఏంటంటే, గ్రోక్ కేవలం వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడమే కాక, వేధించడం, వెంటాడటం, గుర్తింపు దొంగతనం వంటి ప్రమాదకర చర్యలకు ఆయుధంలా మారుతోంది.

సమాచారం ఎలా దొరికింది?

గ్రోక్‌కు ఈ రహస్య సమాచారం ఎలా లభిస్తుందనేది ప్రధాన ప్రశ్న. ఎక్స్ ఏఐ సంస్థ (గ్రోక్‌ను తయారు చేసిన కంపెనీ) చెప్పేదేమంటే, ఇంటర్నెట్‌లో ఎటువంటి ఫిల్టర్‌ లేకుండా లభించిన అత్యధిక మొత్తంలోని సమాచారంతో ఈ నమూన కు శిక్షణ ఇచ్చారు. అంటే, మీ వ్యక్తిగత వివరాలు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో పొరపాటున లీక్ అయినా, బహిరంగ జాబితాలలో ఉన్నా, లేదా డేటా చోరీల్లో బయటపడినా, గ్రోక్ దానిని సేకరించుకుంది. గతంలో, ఈ సమాచారం తెలుసుకోవాలంటే ప్రత్యేక సాధనాలు లేదా డబ్బు చెల్లించే డేటాబేస్‌లు అవసరమయ్యేవి. కానీ, ఇప్పుడు గ్రోక్ దాన్ని అతి సులభంగా ఇచ్చేస్తోంది. డేటా ఆన్‌లైన్‌లో ఉండటం కంటే, గ్రోక్ ఆ చెల్లాచెదురుగా ఉన్న సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి, సాధారణ ప్రజల వ్యక్తిగత వివరాలను నేరుగా బహిర్గతం చేయడమే అసలు సమస్య.

నియమాలకు విరుద్ధం:

గ్రోక్ యొక్క ఈ ప్రవర్తన ఇతర కృత్రిమ మేధస్సు సంస్థల నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఓపెన్ ఏఐ యొక్క చాట్‌జీపీటీ ,గూగుల్ యొక్క జెమిని వంటి ప్రముఖ చాట్‌బాట్‌లు ఏ వ్యక్తి యొక్క ప్రైవేట్ చిరునామాలు, ఫోను సంఖ్యలు లేదా వ్యక్తిగత రికార్డులను యాక్సెస్ చేయడానికి అనుమతించవు. ఈ వ్యవస్థలను భద్రతా వలయాలతో రూపొందించారు. గోప్యతను ఉల్లంఘించడం అనేది అత్యంత తీవ్రమైన తప్పుగా ఈ సంస్థలు భావిస్తాయి. కానీ, గ్రోక్ మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ తీవ్ర వివాదంపై, గోప్యతా నిపుణులు ఖండించినా, గ్రోక్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయన మౌనం ఆందోళనను మరింత పెంచుతోంది.

గ్రోక్ ఒక బాధ్యతాయుతమైన ఏఐ సహాయకుడిలా కాకుండా, వ్యక్తిగత వివరాలను ఆటోమేటిక్‌గా బయటపెట్టే యంత్రంలా పనిచేస్తుండటంతో, సాధారణ ప్రజలకు కూడా తక్షణ ముప్పు ఏర్పడింది. కఠినమైన భద్రతా చర్యలను వెంటనే ప్రవేశపెట్టకపోతే, కృత్రిమ మేధస్సు ప్రపంచంలో గ్రోక్ ఒక అత్యంత ప్రమాదకరమైన గోప్యతా ముప్పుగా మారే అవకాశం ఉంది.