
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం తీరప్రాంత రక్షణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్రపు ఉప్పు నీటిని తట్టుకుని పెరగగలిగే తాటి చెట్లు ఇతర స్థానిక మొక్కలను తీరం పొడవునా నాటాలని. ఈ మొక్కలు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా సముద్రం నుంచి వచ్చే ఉధృతమైన అలల వేగాన్ని అడ్డుకుని తీరం కోతకు గురికాకుండా ఒక సహజమైన గోడలా రక్షిస్తాయి అని పవన్ తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో 50 శాతం పచ్చదనం ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుతూనే ఖాళీగా ఉన్న అటవీ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద అనేది జాతి సంపద అది సంరక్షించుకోవడం మనందరి బాధ్యత పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్న సవాళ్లు, నిధుల వినియోగం వివిధ శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ ప్రయోజనాలను మెరుగుపరచడంతో పాటు బయోడైవర్శిటీని (జీవ వైవిధ్యం) కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు లక్ష్యాలను చేరుకోగలమని, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు తదుపరి కార్యాచరణను వివరించిన అధికారులు మంత్రి సూచనల మేరకు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
