Let's talk: editor@tmv.in
గ్రూప్-1 రద్దు కోరుతూ సీజేఐకి కవిత లేఖ

గ్రూప్-1 రద్దు కోరుతూ సీజేఐకి కవిత లేఖ

Gaddamidi Naveen
24 అక్టోబర్, 2025

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాన‌ని పేర్కొన్నారు. ఈ లేఖలో ఆమె ప్రెసిడెన్షియల్ ఆర్డర్ (ఆర్టికల్ 371 డి) ఉల్లంఘన ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, స్థానిక అభ్యర్థులకు అన్యాయం వంటి అంశాలను ప్రస్తావించారని తెలిపారు. అందువల్ల ఈ పరీక్షను రద్దు చేసి పారదర్శకతతో కూడిన పునఃపరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి దానికి సంబంధించిన నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని కవిత అభ్యర్థించారు.

ఆర్టికల్ 371డి ఉల్లంఘన

రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి స్థానిక అభ్యర్థులకు సమానమైన న్యాయమైన అవకాశాలకు హామీ ఇస్తుందని కవిత గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ రాజ్యాంగ హామీని ధిక్కరించిందని ఆమె తీవ్రంగా ఆరోపించారు.ఈ ఉల్లంఘన కేవలం చట్టపరమైన లోపం కాదు, తెలంగాణ స్ఫూర్తిపై, రాజ్యాంగ న్యాయంపై ప్రజలకు ఉన్న విశ్వాసంపై పడిన గాయం. ఈ పరిస్థితి మరింత బాధాకరంగా మారడానికి కారణం పదేపదే విజ్ఞప్తులు ఫిర్యాదులు పెరుగుతున్న ప్రజా ఆందోళన ఉన్నప్పటికీ రాష్ట్ర అధికారులు ఉదాసీనంగా ఉండటమే అని కవిత లేఖలో పేర్కొన్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నిబద్ధతతో సంవత్సరాలుగా కష్టపడిన లక్షలాది మంది అభ్యర్థుల ఆశలు ఇప్పుడు నిరాశకు , వారి విశ్వాసం సన్నగిల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రెండుసార్లు రద్దయిన పరీక్ష

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు పదేళ్ల తరువాత జరిగిన ఈ పరీక్ష ఇప్పటికే రెండుసార్లు రద్దయిందనే విషయాన్ని కూడా కవిత ప్రస్తావించారు. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు నిరాశకు, ఆందోళనకు గురయ్యారని ఆమె తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్ 2024లో కన్వెన్షనల్ పద్ధతిలో నిర్వహించిన ఈ మెయిన్ పరీక్ష ఫలితాల ద్వారా 563 ఖాళీలకు గాను 562 మంది అభ్యర్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. మార్చి 30, 2025న ప్రచురించబడిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా తదుపరి సర్టిఫికేట్ ధృవీకరణ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా రూపొందించబడింది. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ, కవిత సుప్రీంకోర్టు జోక్యం కోరడం రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చింది.