Let's talk: editor@tmv.in
గ్రీస్‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

గ్రీస్‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

సామాజిక మాధ్యమాల మాయాజాలంలో చిక్కుకుని చిన్నారులు తమ బాల్యాన్ని, స్వేచ్ఛను కోల్పోతున్నారని గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. పిల్లలను బానిసలుగా మార్చేలా ఉన్న యాప్‌ల రూపకల్పన వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

పిల్లల ఆరోగ్యంపై ఆందోళన

పిల్లలు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని ప్రధాని మిత్సోటాకిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులతో పోల్చుకోవడం, ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్లు, ఎప్పుడూ ఫోన్‌లోనే ఉండాలనే ఆరాటం వల్ల వారు అలసిపోతున్నారని.. దీనివల్ల నిద్ర కరువై ఆందోళన చెందుతున్నారని ఆయన వివరించారు. తమ పిల్లలు ఫోన్లకు బానిసలై ఆరోగ్యంగా ఉండటం లేదని చాలామంది తల్లిదండ్రులు మొరపెట్టుకోవడంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇప్పటికే పాఠశాలల్లో ఫోన్లను నిషేధించిన గ్రీస్ ప్రభుత్వం, పిల్లలు ఫోన్ చూసే సమయాన్ని తగ్గించేలా ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి

పిల్లల భద్రత కోసం గ్రీస్ కంటే ముందే చాలా దేశాలు కఠినమైన నియమాలు తెస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గతేడాది డిసెంబర్‌లోనే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను వద్దని చట్టం చేసింది. మాట వినని కంపెనీలకు భారీ జరిమానాలు వేస్తామని కూడా హెచ్చరించింది. ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే ఆంక్షలు మొదలుపెట్టగా.. బ్రిటన్, ఐర్లాండ్ వంటి మరికొన్ని దేశాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. యూరప్ దేశాలన్నీ ఏకమై, సోషల్ మీడియా వాడే పిల్లల వయస్సును ప్రతి ఆరు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేసేలా బలమైన చట్టం తీసుకురావాలని గ్రీస్ ప్రధాని కోరుతున్నారు.

టెక్ దిగ్గజాల అభ్యంతరం

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలా అందరినీ ఒకేసారి నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండదని, దీనిని అమలు చేయడం కూడా చాలా కష్టమని అవి వాదిస్తున్నాయి. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన ఒక కేసులో.. మెటా, యూట్యూబ్ వంటి సంస్థలు కావాలనే పిల్లలను తమ యాప్‌లకు బానిసలుగా మార్చుకుంటున్నాయని కోర్టులు స్పష్టం చేయడం విశేషం. ఈ విషయంపై స్పందిస్తూ "సాంకేతికత వల్ల ఎంతో జ్ఞానం లభిస్తుంది నిజమే, కానీ కేవలం వ్యాపారం కోసం పిల్లల దృష్టిని మళ్లించి వారి స్వేచ్ఛను దెబ్బతీసే ఇలాంటి ధోరణికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిందే" అని ప్రధాని మిత్సోటాకిస్ బలంగా వాదించారు.