
గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి: స్వాగతించిన ఢిల్లీ సీఎం
దీపావళి సందర్భంగా ఢిల్లీలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ (పర్యావరణానికి తక్కువ హని చేసే పటాకులు) విక్రయించడానికి,పేల్చడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అక్టోబర్ 18 నుంచి 21 వరకు చేసుకోవచ్చని సూచించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులను విధించింది. సుప్రీం కోర్టు వెలువరించిన ఈ నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు. సుప్రీం కోర్టు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సమతుల్యమైన విధానాలను ప్రకటించడం స్వాగతించదగినదిగా పేర్కొంటూనే ప్రజలు కూడా ఈ దిపావళి సందర్భంగా పర్యావరణంపై కూడా దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛత, శుభ్రత విషయంలో చాలా అంకిత భావంతో ఉండాలన్నారు. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఈ పండుగను చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే పండుగ సమయాల్లో ప్రజల్లో ఉండే భావోద్వేగాలను,మనోభావాలను గౌరవిస్తూ టపాసులకు అనుమంతిచాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును 2025 అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థించింది. దీపావళి సందర్భంగా గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అనుమతించాలని కోరిన నేపథ్యంలో అందుకనుగుణంగా అనుమతి రావడం సంతోషమని సీఎం రేఖాగుప్తా వివరించారు.
కోర్టు తీర్పు ప్రకారం
• పటాకులు ఉదయం 6 నుంచి 7 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చడానికి అనుమతిని ఇచ్చింది.
• కేవలం నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్సిట్యూషన్ (NEERI) ఆమోదించిన గ్రీన్ క్రాకర్స్ కే అనుమతి.
• ‘నీరి’ అనేది సీఎస్ఐఆర్ లో భాగంగా పని చేస్తూ గ్రీన్ ఫైర్‌క్రాకర్స్‌కి సాంకేతిక ప్రమాణాలు నిర్ణయించే ప్రభుత్వ శాస్త్రీయ సంస్థ
• క్యూఆర్ కోడ్ ఉన్న ఉత్పత్తులకే విక్రయించడానికి అనుమతి, నకిలీ పటాకులు అమ్మితే లైసెన్స్ రద్దు
• పోలీస్ పర్యవేక్షణ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలి.
• ఇతర రాష్ట్రాల నుంచి పటాకులు తీసుకురావడం పూర్తిగా నిషేదం.
• సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు అక్టోబర్ 14 నుంచి 21 వరకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతపై పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతంలో ఢిల్లీ ప్రభుత్వం (అక్టోబర్ 14, 2024) పూర్తిగా పటాకులపై నిషేదం విధించిన ఆదేశాన్ని జారీ చేయగా, ఈసారి కోర్టు ప్రజా భావోద్వేగాలు, అమలు సవాళ్ల నేపథ్యంలో ఆ విధానాన్ని పునరాలోచించింది. అయితే నాటి ప్రభుత్వం కూడా నిషేదం విధించడానికి గాలిలో నాణ్యత ప్రమాదకరంగా మారింది.
2024 దీపావళి సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా దారుణ స్థాయిలో పడిపోయింది..
అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 400–450 మధ్య నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన కేటగిరీకి చెందుతుంది. అలాగే 2024 దీపావళి నాటి రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఎయిర్ క్వాలిటీ 470 దాటింది. కొన్నిచోట్ల (ఆనంద్ విహార్, జహంగీర్‌పురి) 490–495 వరకు కూడా నమోదైంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పటాకులు పేల్చడం, అమ్మడంపై పూర్తి నిషేదం విధించింది. కానీ ఆ నిషేదం అమలులో పెద్దగా ఫలితం కనిపించలేదు, కొందరు నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు చేసుకున్నారు. ప్రస్తుతం కూడా గాలిలో నాణ్యత ప్రమాదకర స్థాయిలోనే ఉంది.
