
గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలూ భాగస్వామ్యం కావాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రీన్ కవర్’ ప్రాజెక్టును ఒక సామాజిక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్ర మొత్తం భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని నింపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం పచ్చదనం ఉండగా వచ్చే నాలుగేళ్లలో దీనిని మరో 7 శాతానికి పెంచేందుకు సుమారు 9 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని ఉగాది నాటికి అన్ని శాఖలు తమ వార్షిక యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తదుపరి సమావేశం నాటికి పూర్తి స్థాయి కార్యాచరణతో రావాలని ఉన్నతాధికారులను నిర్దేశించారు.
తీర ప్రాంత రక్షణ కోసం ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలని అక్కడ పెనుగాలులు ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లలో కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలను నాటాలన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల రకాల మొక్కలను, కాలువలు, చెరువు గట్ల వెంబడి స్వజాతి వృక్ష జాతులను పెంచాలని స్పష్టం చేశారు. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన అభిలషించారు.
ఇక బడ్జెట్ కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి తగినన్ని నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇస్తూ యంత్రాంగం మొత్తం నిబద్ధతతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
